Akhilesh Yadav: కూటమి ఏర్పాటు మా పని కాదు... తెగేసి చెప్పిన అఖిలేష్

ABN , First Publish Date - 2023-03-26T20:00:26+05:30 IST

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య విపక్ష కూటమి ఏర్పాటుపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ..

Akhilesh Yadav: కూటమి ఏర్పాటు మా పని కాదు... తెగేసి చెప్పిన అఖిలేష్

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో బీజేపీకి (BJP) వ్యతిరేకంగా ఐక్య విపక్ష కూటమి (Opposition Alliance) ఏర్పాటుపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆదివారంనాడు స్పందించారు. కూటమి ఏర్పాటు చేయడం తమ పని కాదని, కూటమికి సహకరించడమే తమ పని అని అన్నారు. రాష్ట్రాల్లో బీజేపీతో (BJP) పోరాడే ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు మద్దతివ్వాలని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సూచించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహం చేపట్టడాన్ని అభినందించారు.

కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమానికి మీ మద్దతు ఉంటుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, రాహుల్ గాంధీ పట్ల సమాజ్‌వాదీ పార్టీ సానుభూతితో ఉంటుందా లేదా అనేది ప్రశ్న కాదని, దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ అనేది ప్రధానమని అన్నారు. ఏ పార్టీకీ తమ సానుభూతి ఉండదన్నారు.

ప్రాంతీయ పార్టీలకు సహకరించాలి..

రాష్ట్ర స్థాయిలో బీజేపీతో పోరాటం సాగించే ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు సహకరించాలని అఖిలేష్ సూచించారు. కేంద్రంలోని ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీలకు హాని చేస్తూ వస్తున్నాయని అన్నారు. ఇవాళ సీబీఐ, ఈడీ, ఐటీ వంటి ఏజెన్సీలు ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసుకుంటున్నాయని ఆరోపించారు. నేతాజీ (ములాయం సింగ్ యాదవ్), లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, స్టాలిన్, కేసీఆర్, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలపై కేంద్రంలో ఉన్న పార్టీలు టార్గెట్ చేస్తూ వస్తున్నాయని అన్నారు.

కమ్యూనలిజంపై మీడియా అడిగిన ప్రశ్నకు అఖిలేష్ సమాధానమిస్తూ... ''ఎవరు కమ్యూనల్ అనేది ప్రశ్న కాదు. సమాజంలోని చదువుకున్న వర్గం కమ్యూనల్‌గా మారి, అబద్ధాలనే నిజాలుగా నమ్ముతుంటే సమాజానికి, ప్రజాస్వామ్యానికి అంతకంటే పెద్ద ముప్పు ఏముంటుంది? ఇవాళ మనం ఆ స్థితికి చేరుకున్నాం'' అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి జూన్ 5వ తేదీ నాటికి అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని ప్రతి బూత్‌లోనూ క్యాడర్ ఉంటుందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తామని అఖిలేష్ అన్నారు.

Updated Date - 2023-03-26T20:00:26+05:30 IST