Nitin Desai: 'లగాన్' కళా దర్శకుడు నితిన్ దేశాయ్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-08-02T14:39:23+05:30 IST

బాలీవుడ్ ప్రముఖ కళాదర్శకుడు నితిన్ దేశాయ్ బుధవారం ఉదయం అత్మహత్య చేసుకున్నారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. 'లగాన్', 'జోథా అక్బర్', 'దేవ్‌దాస్' వంటి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఆయన కళాదర్శకుడిగా పనిచేశారు. పలు జాతీయ అవార్డులు అందుకున్నారు.

Nitin Desai: 'లగాన్' కళా దర్శకుడు నితిన్ దేశాయ్ ఆత్మహత్య

ముంబై: బాలీవుడ్ ప్రముఖ కళాదర్శకుడు (Art Director) నితిన్ దేశాయ్ (Nitin Desai) బుధవారం ఉదయం అత్మహత్య చేసుకున్నారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. 'లగాన్', 'జోథా అక్బర్', 'దేవ్‌దాస్' వంటి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఆయన కళాదర్శకుడిగా పనిచేశారు.


నితిన్ దేశాయ్‌కు సొంతగా ఎన్‌డీ (ND) స్టూడియో ఉంది. కర్జత్ సమీపంలోని ఖాలాపూర్ రాయ్‌గఢ్‌లో ఉన్న తన స్టూడియోలోనే ఆయన ఉరి వేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 10 గంటలకు ఆయన తన గదికి వెళ్లారని, ఉదయం ఎంతసేపటికీ ఆయన బయటకు రాకపోవడంతో బాడీగార్డులు, ఇతర సిబ్బంది ఆయన గదికి వెళ్లారని, లోపల తాళం వేసి ఉందని, ఆ తర్వాత ఆయన ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్టు తాము కనుగొన్నామని చెప్పారు.


ఆర్థిక ఇబ్బందులతో...

ఆర్థిక సమస్యల కారణంగానే నితిన్ దేశాయ్ ఉరి వేసుకున్నట్టు కనిపిస్తోందని కర్జత్ అర్బన్ ఎమ్మెల్యే మహేష్ బల్ది తెలిపారు. చాలాకాలంగా ఆయన మనస్తాపంతో ఉన్నట్టు చెప్పారు. ఆయన స్టూడియో తన నియోజకవర్గంలోనే ఉందని, ఉద్యోగులకు కూడా ఆయన జీతాలు ఇవ్వలేకపోతున్నట్టు స్టూడియోలో పనిచేస్తున్న సిబ్బంది తనతో చెప్పారని బల్ది వివరించారు.


20 ఏళ్ల ప్రస్థానం..

నితీన్ దేశాయ్ తన 20 ఏళ్ల కెరీర్‌లో అశుతోష్ గోవారికర్, విధు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరాని, సంజయ్ లీలా బన్సాలీ వంటి దర్శకనిర్మాతలతో పనిచేశారు. 1989లో 'పరిండా' చిత్రానికి కళా దర్శకుడిగా ఆయన తొలిసారి పనిచేశారు. 1942: ఎ లవ్ స్టోరీ (1993), ఖామోషి: ది మ్యూజికల్ (1995), ప్యార్ తో హోనా హై థా (1998), హమ్ దిల్ దే చుకే సనమ్ (1999), మిషన్ కశ్మీర్ (2000), రాజు చాచా (2000), దేవదాస్ (2002), మున్నాభాయ్ ఎంబీబీఎస్ (2003), వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై (2010) చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చయి. కళా దర్శకుడిగా అశుతోష్ గోవారికర్ సారథ్యంలోని 'పానిపట్' చిత్రానికి చివరిసారిగా పనిచేశారు. నితిన్ దేశాయ్ 52 ఎకరాల స్థలంలో ఎన్డీ స్టూడియో నిర్మించారు. జోథా అక్బర్, ట్రాఫిక్ సిగ్నల్ వంటి ఎన్నో చిత్రాలు ఈ స్టూడియోలో తీశారు.


హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్, దేవదాస్ చిత్రాలకు కళాదర్శకుడిగా నితిన్ దేశాయ్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ (1999), హుమ్దిల్ దే చుకే సనమ్ (2000), లగాన్ (2002), దేవదాస్ (2023) చిత్రాలకు నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 2011లో 'హల్లో జై హింద్' చిత్రానికి ఆయన తొలిసారి దర్శకత్వం వహించారు. 2008లో 'రాజా శివ్‌ఛత్రపతి', 2018లో 'ట్రక్‌భర్ స్వప్నే' చిత్రాలను సొంతంగా నిర్మించారు.

Updated Date - 2023-08-02T14:39:23+05:30 IST