Nirmala Sitharaman: రాజదండంపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-05-26T07:57:15+05:30 IST

కొత్త పార్లమెంటులో రాజదండంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ..

Nirmala Sitharaman: రాజదండంపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కొత్త పార్లమెంట్‌లో సభాపతి సమీపాన తమిళనాడుకు చెందిన రాజదండాన్ని అమర్చనుండటం రాష్ట్రానికే గర్వకారణమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) పేర్కొన్నారు. అంతేకాకుండా పాలకులు ఏకపక్షంగా కాకుండా అందరికీ సమన్యాయంతో కూడిన పాలన అందించాలని ఎల్లప్పుడూ గుర్తు చేసే అధికారిక చిహ్నంగా ఈ రాజదండం ఉంటుందన్నారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, తెలంగాణా, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Governor Dr. Tamilisai Soundararajan), నాగాలాండ్‌ గవర్నర్‌ ఇల గణేశన్‌, కేంద్ర మత్స్యశాఖ మంత్రి ఎల్‌.మురుగన్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబుతో కలిసి ఆమె విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కొత్త పార్లమెంట్‌ భవనాన్ని జాతికి అంకితం చేసేటప్పుడు 1947లో స్వాతంత్య్రం సిద్ధించిన రోజు ఆంగ్లేయుల పాలన ముగిసిన తర్వాత అధికార మార్పిడి రాజదండం ద్వారా జరిగిందనే విషయం అందరికీ జ్ఞప్తికి వస్తుందని తెలిపారు. అప్పటి అధికార మార్పిడిలో తమిళనాడు కూడా కీలక పాత్ర పోషించిందని, అప్పటి ప్రధాని నెహ్రూ కోరిక మేరకు తొలి గవర్నర్‌ జనరల్‌ రాజాజీ సూచించిన విధంగా తిరువాడుదురై ఆధీనం సలహా పొంది రాజదండం ద్వారా అధికార మార్పిడి జరిగిందని ఆమె వివరించారు. బంగారు పూతపూసిన ఆ రజత రాజదండాన్ని తయారు చేసిన నగరానికి చెందిన ప్రముఖ నగల వర్తకులు ఉమ్మిడి జ్యువెలర్స్‌ పెద్దలు కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించిన కార్మికులను, రాజదండాన్ని తయారు చేసిన ఉమ్మిడి పెద్దలకు ప్రధాని మోదీ ఈ నెల 27న పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించనున్నారని నిర్మల తెలిపారు. పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవనిఇకి ధర్మపురి, తిరువాడుదురై సహా 20 మఠాధిపతులకు ఆహ్వానాలు పంపినట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో రాజదండం ప్రతిష్థించడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని, మరో వందేళ్లపాటు ఆ రాజదండం జాతీయ చిహ్నంగా ఉండబోతోందన్నారు. ప్రజాస్వామ్య ఆలయంగా పరిగణించే పార్లమెంట్‌ ప్రారంభోత్సవంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలకు వెళ్లకుండా పాల్గొనాలని ఆమె కోరారు.

nani1.2.jpgగతంలో రాష్ట్రపతి పదవిని తీవ్రంగా విమర్శించినవారే ప్రస్తుతం రాష్ట్రపతితో పార్లమెంట్‌ ప్రారంభోత్సవం జరగాలని పట్టుబడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. అంతే కాకుండా ఇటీవల చత్తీస్‏ఘడ్‌ కొత్త సచివాలయాన్ని ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియగాంధీ ప్రారంభించారని, తెలంగాణ(Telangana)లో సచివాలయ ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్రగవర్నర్‌ను ఆహ్వానించకుండా ముఖ్యమంత్రే ప్రారంభించారని, వీటిపై ఎలాంటి విమర్శలు చేయని ప్రతిపక్షాలు ప్రస్తుతం పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని ప్రారంభోత్సవం చేయడాన్ని విమర్శించడం గర్హనీయమన్నారు.

nani1.3.jpg

Updated Date - 2023-05-26T07:57:15+05:30 IST