Modi Surname case: సుప్రీంకోర్టులో రాహుల్ అఫిడవిట్
ABN , First Publish Date - 2023-08-02T21:07:01+05:30 IST
మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో బుధవారంనాడు రిజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 63 పేజీల అఫిడివెట్‌లో రాహుల్.. ఈ కేసు 'అసాధారణమైన కేటగిరి' కిందకు రాదని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. క్షమాపణే అయితే ఈపాటికే చెప్పేవాడినని అన్నారు.
న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరు (Modi Surname) వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుప్రీంకోర్టు (Supreme court)లో బుధవారంనాడు రిజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 63 పేజీల అఫిడివెట్‌లో రాహుల్.. ఈ కేసు 'అసాధారణమైన కేటగిరి' కిందకు రాదని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. తాను శిక్షార్హమైన ఎలాంటి నేరానికి పాల్పడలేదని, క్షమాపణే చెప్పాల్సి వస్తే అదే అతిపెద్ద శిక్ష అవుతుందని పేర్కొన్నారు. ఒక వేళ క్షమాపణే అయితే ఈ పాటికే చెప్పేవాడనని అన్నారు.
క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందునే పిటిషన్ పూర్ణేష్ మోదీ తనను 'అహంకారి'గా పేర్కొన్నట్టు రాహుల్ తన అఫిడవిట్‌తో తెలిపారు. తాను ఏ నేరం చేయలేదని, అయినా ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద క్రిమినల్ నేరం మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. తనకు విధించిన శిక్షపై స్టే ఇవ్వాలని అఫిడవిట్‌లో కోరారు. తద్వారా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
కేసు ఏమిటి?
కర్ణాటకలో జరిగిన ఒక ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకు ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్ బీజేపీ నేత పూర్ణేష్ మోదీ 2019లో రాహుల్‌పై క్రిమినల్ పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో రాహుల్‌ను సూరత్ కోర్టు దోషిగా నిర్దారిస్తూ, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద రాహుల్ వయనాడ్ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలో సూరత్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో వేసిన తాజా అఫిడవిట్‌లో రాహుల్ సవాలు చేశారు.