Share News

Modi-Sheikh Hasina: 3 రైల్, పవర్ ప్రాజెక్టులను సంయుక్తంగా ప్రారంభించిన మోదీ, షేక్ హసీనా

ABN , First Publish Date - 2023-11-01T18:26:36+05:30 IST

ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మైత్రి, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా మరో ముందడుగు పడింది. ఇందులో భాగంగా భారత్ సాయం అందిస్తున్న మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బుధవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

Modi-Sheikh Hasina: 3 రైల్, పవర్ ప్రాజెక్టులను సంయుక్తంగా ప్రారంభించిన మోదీ, షేక్ హసీనా

న్యూఢిల్లీ: ఇండియా-బంగ్లాదేశ్ (India-Bangadesh) మధ్య మైత్రి, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా మరో ముందడుగు పడింది. ఇందులో భాగంగా భారత్ సాయం అందిస్తున్న మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi), బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) బుధవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ మూడు ప్రాజెక్టులలో అఖౌర-అగర్తలా క్రాస్ బోర్డ్ రైల్ లింక్, ఖుల్నా-మంగ్లా పోర్ట్ రైల్ లైన్, బంగ్లాదేశ్‌లోని రాంపాల్‌లోని మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాట్ యూనిట్-2 ఉన్నాయి.


మూడు రెట్లు పెరిగిన వాణిజ్యం

భారత్-బంగ్లా మధ్య మైత్రీ సంబంధాల పటిష్టతలో ఇదొక ముందడుగని ప్రధాని ఆ సందర్భంగా పేర్కొన్నారు. ''గత 9 ఏళ్లలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం మూడు రెట్లు పెరిగింది. ఈరోజు అఖౌర-అగర్తలా రైల్ లింగ్ ప్రారంభించడం ఒక చారిత్రక ఘట్టం. బంగ్లాదేశ్‌కు, భారత ఈశాన్య ప్రాంతమైన త్రిపురకు మధ్య తొలి రైల్ లింగ్ ఇది. విముక్తి పోరాటం నుంచి కూడా త్రిపురతో బంగ్లాదేశ్‌తో బలమైన అనుబంధం ఉంది. మైత్రీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రెండో యూనిట్ ప్రారంభిస్తుండటం కూడా చాలా సంతోషంగా ఉంది'' అని మోదీ తెలిపారు. పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌తో ఇండియా 'సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్' విధానాన్ని అనుసరిస్తోందన్నారు. బంగ్లాదేశ్ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామిగా ఇండియా నిలవడం చాలా గర్వంగా ఉందని, గత 9 ఏళ్లలో 10 బిలియన్ డాలర్ల సాయం అందించామన్నారు. ఉభయదేశాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు.


కృతజ్ఞతలు తెలిపిన షేక్ హసీనా

రెండు మైత్రీ దేశాల మైత్రీ సంబంధాలకు ప్రతీకగా మూడు కీలక ప్రాజెక్టులను సంయుక్తంగా ప్రారంభింస్తుండటం సంతోషంగా ఉందని, జి-20 సదస్సులు సెప్టెంబర్‌లో తాను హాజరైనప్పుడు ఎంతో ఆదరం చూపిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలని షేక్ హసీనా ఈ సందర్భంగా అన్నారు. భారతదేశ ప్రజలందరికీ ముందస్తుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-11-01T18:26:36+05:30 IST