Mallikarjun Kharge: ఖర్గే నివాసంలో సమావేశమైన ప్రతిపక్ష ఎంపీలు ఏం నిర్ణయించారంటే?

ABN , First Publish Date - 2023-03-27T22:05:25+05:30 IST

ఓ పక్క విపక్ష ఎంపీల సమావేశం జరుగుతుండగానే ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్ కమిటీ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.

Mallikarjun Kharge: ఖర్గే నివాసంలో సమావేశమైన ప్రతిపక్ష ఎంపీలు ఏం నిర్ణయించారంటే?
Meeting of Opposition leaders

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు (Disqualification of Rahul Gandhi as Lok Sabha MP) నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నల్లదుస్తులతో నిరసనలు కొనసాగించాలని విపక్ష ఎంపీలు నిర్ణయించారు. ఐక్య పోరు కొనసాగించాలని నిర్ణయించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆర్జేడీ (RJD), జేడియూ (JDU), డీఎంకే (DMK), సీపీఐ (CPI), సీపీఎం(CPM), ఆప్(AAP), ఎన్సీపీ (NCP), నేషనల్ కాన్ఫరెన్స్(NC), భారత్ రాష్ట్ర సమితి (BRS) తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు.

ఓ పక్క విపక్ష ఎంపీల సమావేశం జరుగుతుండగానే ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని(vacate the government allotted bungalow) లోక్‌సభ హౌజింగ్ కమిటీ(Lok Sabha Housing Committee) రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 22లోగా ఆయన తన బంగళాను ఖాళీ చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఖాళీ చేయడానికి ఆయనకున్న వ్యవధి 26 రోజులు మాత్రమే. 2014 నుంచి రాహుల్ ఢిల్లీ 12 తుగ్లక్ లేన్ లోని ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు.

ఒక్క వ్యక్తి ప్రయోజనాలు కాపాడటం కోసం మోదీ 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారంటూ ఖర్గే ట్వీట్ చేశారు. తప్పు చేసి ఉండకపోతే అదానీ విషయంలో జేపీసీ ఎందుకు వేయరని ఆయన ప్రశ్నించారు. తన నివాసంలో జరిగిన సమావేశానికి హాజరైన ఎంపీల ఫొటోలను జత చేశారు.

విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై నిలుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (Congress Gen Secy KC Venugopal) సమావేశానంతరం వ్యాఖ్యానించారు.

ఖర్గే ఇచ్చిన డిన్నర్ సమావేశానికి శివసేన ఉద్ధవ్ వర్గం డుమ్మా కొట్టింది. తమ వర్గం నేతలెవరూ ఖర్గే డిన్నర్ సమావేశానికి వెళ్లరని శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) ముందే వెల్లడించారు. రాహుల్ అనవసరంగా సావర్కర్ పేరును వివాదంలోకి లాగుతున్నారని రౌత్ చెప్పారు. తమకు సావర్కర్, ఛత్రపతి శివాజీ స్ఫూర్తి అని స్పష్టం చేశారు. రాహుల్ ప్రకటన తప్పని రౌత్ తేల్చి చెప్పారు.

అంతకు ముందు మోదీ ఇంటి పేరుకలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. ‘‘ కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని (Rahul Gandhi) సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దోషిగా తేల్చడంతో లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హత వేటు పడింది. దోషిగా తేలిన 23 మార్చి 2023 నుంచి నుంచి అనర్హత వర్తిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటరీయేట్ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సర్క్యూలర్ జారీ చేశారు. ఈ కేసులో సూరత్ కోర్ట్ ప్రస్తుతానికి కోర్టు 30 రోజుల బెయిల్ ఇచ్చినా తర్వాత ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోతున్నాయి. పై కోర్టులు కనుక సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్‌ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

Updated Date - 2023-03-27T22:08:21+05:30 IST