రోజుకో మలుపు తిరుగున్న మండ్య రాజకీయం.. సుమలత బాటలో మరో మాజీ ఎంపీ

ABN , First Publish Date - 2023-03-19T13:25:45+05:30 IST

మండ్య రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. మండ్య ఇండిపెండెంట్‌ లోక్‌సభ సభ్యురాలు సుమలత(Sumalata) బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు

రోజుకో మలుపు తిరుగున్న మండ్య రాజకీయం.. సుమలత బాటలో మరో మాజీ ఎంపీ

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మండ్య రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. మండ్య ఇండిపెండెంట్‌ లోక్‌సభ సభ్యురాలు సుమలత(Sumalata) బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మండ్యలో రాజకీయం మరింత వేడెక్కెతోంది. ఆమె బీజేపీకి మద్దతు ప్రకటించగా మండ్య మాజీ ఎంపీ, జేడీఎస్‌ నుంచి సస్పెన్షన్‌ వేటు పడిన ఎల్‌ఆర్‌ శివరామేగౌడ(LR Sivaramegowda) బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో మండ్యలో మాజీ ఎంపీలు మరోసారి రానున్న శాసనసభ ఎన్నికల్లో తెరపైకి వస్తున్నట్టు అనిపిస్తోంది. గతంలో కొన్ని నెలలపాటు మాత్రమే మండ్య ఎంపీగా కొనసాగిన సినీ నటి రమ్య కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రానున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలతో ఆమె చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇక ఎల్‌ఆర్‌ శివరామేగౌడ జేడీఎస్‌ నుంచి గెలుపొంది ఎంపీగా వ్యవ హరించారు. 2019 ఎన్నికల్లో ఆయన టికెట్‌ దక్కుతుందని భావించారు. కానీ అనూహ్యంగా జేడీఎస్‌ కీలక నేత కుమారస్వామి వారసుడు నిఖిల్‌ పోటీ చేయడంతో శివరామేగౌడకు చుక్కెదురైంది. అప్పటి నుంచి ఆయన పార్టీకి వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా జేడీఎస్‌ నేతలపై నేరుగా విమర్శలు పెంచారు. రానున్న ఎన్నికల్లో నాగమంగల నుంచి ఇండిపెండెంట్‌(Independent)గా పోటీ చేస్తానని ఆయన రెండు నెలలక్రితమే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించారు. అనూహ్యంగా శనివారం ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులకు ఓ సందేశాన్ని పంపారు. నాయండహళ్లిలోని నంది లింక్‌ గ్రౌండ్స్‌లో ఆదివారం సభ ఏర్పాటు చేశామని అభిమానులు తరలి రావాలని ప్రకటించారు. సభకు వస్తున్న మంత్రులు సోమణ్ణ, డాక్టర్‌ సుధాకర్‌, ఎస్‌టీ సోమశేఖర్‌లకు ఇదే ఆహ్వానమంటూ రాసుకున్నారు. ముగ్గురు కీలక మంత్రులు మాజీ ఎంపీ సభకు హాజరవుతున్నారంటే ఆయన బీజేపీ చేరే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు తెలుస్తోంది. మండ్య జిల్లా దశాబ్దాలకాలంగా జేడీఎస్‌(JDS)కు కంచుకోటలాంటిది. ఇటీవల వరుస దెబ్బలు కొనసాగుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో నిఖిల్‌ ఓడిపోవడం, నారాయణగౌడ ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేసి బీజేపీలో చేరడంతోపాటు పలువురు జేడీఎస్‌కు దూరమవుతూ వచ్చారు. ప్రస్తుతం బీజేపీలోకి కీలకులు ప్రవేశిస్తుండడంతో మండ్య రాజకీయం రసవత్తరం అవుతోంది.

pandu4.jpg

Updated Date - 2023-03-19T13:25:45+05:30 IST