Pradeep Shettar: బీజేపీకి లింగాయత్ దిగ్గజ నేతలు గుడ్‌బై..?

ABN , First Publish Date - 2023-09-04T21:02:28+05:30 IST

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి జదదీష్ షెట్టర్ సోదరుడు ప్రదీప్ షెట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లింగాయత్ పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఇప్పుడు లింగాయత్‌లను పక్కన పెట్టేశారని, ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. సమీప భవిష్యత్తులో అనేక మంది లింగాయత్ దిగ్గజ నేతలు పార్టీని విడిచిపెట్టే అవకాశాలున్నట్టు చెప్పారు.

Pradeep Shettar: బీజేపీకి లింగాయత్ దిగ్గజ నేతలు గుడ్‌బై..?

బెంగళూరు: కర్ణాటక (Karnataka) బీజేపీ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి జదదీష్ షెట్టర్ సోదరుడు ప్రదీప్ షెట్టర్ (Pradeep Shettar) సంచలన వ్యాఖ్యలు చేశారు. లింగాయత్ పార్టీగా చెప్పుకునే బీజేపీ (BJP)లో ఇప్పుడు లింగాయత్‌లను పక్కన పెట్టేశారని, ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. సమీప భవిష్యత్తులో అనేక మంది లింగాయత్ దిగ్గజ నేతలు పార్టీని విడిచిపెట్టే అవకాశాలున్నట్టు చెప్పారు.


మోదీ మూడోసారి ప్రధాని కావాలంటే...

లింగాయత్ దిగ్గజ నేతలైన మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, జగదీష్ షెట్టర్‌లను పార్టీ దూరంగా పెట్టేసిందని, ఈ ఇద్దరు నేతలతో సహా అనేక మంది నేతలు త్వరలోనే పార్టీని వీడవచ్చని ప్రదీష్ షెట్టర్ జోస్యం చెప్పారు. యడియూరప్పను ముఖ్యమంత్రి కుర్చీ నుంచి ఏమాత్రం గౌరవం లేనివిధంగా బీజేపీ దించేసిందని అన్నారు. ఇప్పటికైనా లింగాయత్ నేతలకు పార్టీ నాయకత్వం అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలనుకుంటే పార్టీలోని లింగాయత్‌ల సేవలను వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు.


పార్టీలోని లింగాయత్ నేతలు పలువురుని ఎందుకు పక్కనపెట్టాల్సి వచ్చిందో, ఇలాంటి ట్రెండ్‌కు కారణమేమిటో తనకు తెలియదని చెప్పారు. అయితే, బీజేపీలో నాయకత్వం లేపమే ఇందుకు కారణం కావచ్చని అన్నారు. మాజీ మంత్రి శంకర్ పాటిల్, జేఎస్ మధుస్వామి, ఎమ్మెల్యే రేణుకాచార్య, మాజీ ఎమ్మెల్యే ఎస్ఐ చిక్కనాగగౌడర్ వంటి కొందరు నేతలు పార్టీని వీడే అవకాశాలున్నాయని ఆయన సంకేతాలిచ్చారు. పార్టీని వీడే వారిలో మీరు కూడా ఉండే అవకాశం ఉందా అని అడిగినప్పుడు సూటిగా ఆయన సమాధానమివ్వలేదు. పార్టీలో ఉంటే అధిష్ఠానానికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తానని ఆయన సమాధానమిచ్చారు. కాగా, 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 69 మంది లింగాయత్‌ నేతలను బీజేపీ బరిలోకి దింపగా 15 మంది గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 46 సీట్లలో లింగాయత్ అభ్యర్థులను పోటీలోకి దంపగా 37 మంది గెలుపొందారు.

Updated Date - 2023-09-04T21:05:19+05:30 IST