kisan mahapanchayat: ఢిల్లీ వైపుగా లక్షలాదిమంది రైతులు.. కారణం ఏంటంటే?

ABN , First Publish Date - 2023-03-19T21:48:01+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో సోమవారం జరగనున్న ‘కిసాన్ మహాపంచాయత్’(Kisan Mahapanchayat) కోసం దేశం నలుమూలల

 kisan mahapanchayat: ఢిల్లీ వైపుగా లక్షలాదిమంది రైతులు.. కారణం ఏంటంటే?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో సోమవారం జరగనున్న ‘కిసాన్ మహాపంచాయత్’(Kisan Mahapanchayat) కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాదిమంది రైతులు తరలి వస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా(SKM) తెలిపింది. కనీస మద్దతు ధర (MSP) చట్టపరమైన హామీ కోసమే కిసాన్ పంచాయత్ నిర్వహిస్తున్నట్టు రైతు సంఘం గత నెలలో తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్టు పేర్కొంది.

ఎస్‌కేఎం నేత దర్శన్ పాల్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 9 డిసెంబరు 2021న కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక హామీని నిలబెట్టుకోవాలని కోరారు. సంక్షోభ నివారణకు సమర్థ చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఎస్‌కేఎం సారథ్యంలో రైతులు ఏడాదికిపైగా ఆందోళన నిర్వహించారు. దీంతో వెనక్కి తగ్గిన మోదీ సర్కారు సాగు చట్టాలను రద్దు చేసింది. అపరిష్కృతంగా ఉన్న రైతు సమస్యలతోపాటు ఆందోళన సందర్భంగా రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తామని కేంద్రం హామీ ఇచ్చిన తర్వాత రైతులు ఆందోళన విరమించారు.

Updated Date - 2023-03-19T21:48:01+05:30 IST