Centre Vs SC Collegium : రహస్య సమాచారాన్ని సుప్రీంకోర్టు కొలీజియం బయటపెడుతోంది : కిరణ్ రిజిజు

ABN , First Publish Date - 2023-01-24T18:24:38+05:30 IST

సుప్రీంకోర్టు కొలీజియం తీరుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Centre Vs SC Collegium : రహస్య సమాచారాన్ని సుప్రీంకోర్టు కొలీజియం బయటపెడుతోంది : కిరణ్ రిజిజు
Kiren Rijiju

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కొలీజియం తీరుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) సమర్పించిన సున్నితమైన నివేదికలను కొలీజియం బయటపెట్టడం అత్యంత ఆందోళనకరమని తెలిపారు. నిఘా వ్యవస్థ అధికారులు దేశం కోసం గోప్యంగా ఉంటూ పని చేస్తారని, వారు ఇచ్చే నివేదికలను బయటకు వెల్లడించే విషయంలో కొలీజియం భవిష్యత్తులో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై తాను సరైన విధానంలో స్పందిస్తానని చెప్పారు.

న్యాయమూర్తుల నియామకాల విషయంలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానాలు కొన్ని ఇటీవల బహిర్గతమయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల కోసం సుప్రీంకోర్టు సిఫారసు చేసిన కొందరికి సంబంధించిన RAW, IB నివేదికలు వీటిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, కిరణ్ రిజిజు మాట్లాడుతూ, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంపై RAW, IB ఇచ్చిన రహస్య నివేదికలను బయటపెట్టడం తీవ్ర ఆందోళనకరమని తెలిపారు. దీనిపై తాను సకాలంలో సరైన విధంగా స్పందిస్తానని చెప్పారు.

కిరణ్ రిజిజు సోమవారం మాట్లాడుతూ, న్యాయమూర్తులు ఎన్నికలను ఎదుర్కొనవలసిన అవసరం ఉండదని, వారిపై బహిరంగ తనిఖీ ఉండదని, అయినప్పటికీ ప్రజలు వారిని గమనిస్తూనే ఉంటారని, వారు ఇచ్చే తీర్పులనుబట్టి వారిని మదింపు చేస్తారని అన్నారు. ‘‘ప్రజలు మిమ్మల్ని మార్చలేరు. కానీ మీ తీర్పులను గమనించి, అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు’’ అన్నారు సామాజిక మాధ్యమాల శకంలో దేనినీ దాచలేమని చెప్పారు. కొందరు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య మహాభారత యుద్ధం జరగడం లేదన్నారు. చర్చలు, సంభాషణలు లేకపోతే ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

Updated Date - 2023-01-24T18:24:42+05:30 IST