China Incursion: నాతో అరుణాచల్ రండి...రాహుల్‌కు రిజిజు సవాల్..!

ABN , First Publish Date - 2023-08-08T18:59:13+05:30 IST

చైనా ఆక్రమణల పై కాంగ్రెస్ ఎంపీలు పదేపదే విమర్శలు చేస్తుండటంపై కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమిత ప్రాంతాలు నిజానికి మాజీ ప్రధాని నెహ్రూ అప్పగించనవేనని అన్నారు. అసలు సత్యం ఎరుకపరచేందుకు పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే కాంగ్రెస్ ఎంపీలను అరుణాచల్ తీసుకువెళ్తానని ప్రతిపాదించారు.

China Incursion: నాతో అరుణాచల్ రండి...రాహుల్‌కు రిజిజు సవాల్..!

న్యూఢిల్లీ: మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-confidence motion)పై లోక్‌సభ (Lok sabha)లో మంగళవారం వాడివేడి చర్చ సాగింది. పలు అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయగా, అధికార పార్టీ ఎంపీలు నరేంద్ర మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి పనులను ఏకరవు పెట్టారు. ఈ క్రమంలోనే చైనా ఆక్రమణల (China Incursion)పై కాంగ్రెస్ ఎంపీలు పదేపదే విమర్శలు చేస్తుండటంపై చర్చలో పాల్గొన్న కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమిత ప్రాంతాలు నిజానికి మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అప్పగించనవేనని అన్నారు. అసలు సత్యం ఎరుకపరచేందుకు పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే కాంగ్రెస్ ఎంపీలను అరుణాచల్ తీసుకువెళ్తానని ప్రతిపాదించారు.


''1962లో లద్దాఖ్, అరుణాచల్‌పై చైనా దాడి చేసింది. మన భూభాగాన్ని కాపాడాలంటూ అప్పుడు అటల్‌జీ (వాజ్‌పేయి) మాట్లాడారు. అప్పటికి నేను పుట్టలేదు. అయినా చరిత్ర, రికార్డులు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పశ్చిమ అరుణాచల్‌ మొత్తాన్ని చైనా పట్టుకుని అసోం వచ్చింది. అసోం ప్రజలను తలచుకుంటే తన హృదయం ద్రవిస్తోందని ఆలిండియా రేడియా ద్వారా నెహ్రూ ఒక సందేశం ఇచ్చారు. అసోం ప్రజల బాధ గురించి మాట్లాడారే కానీ ఇంక ఏవిషయం ఆయన మాట్లాడలేదు. చైనా ఆక్రమించిన ప్రతి అంగుళం భూమిని మన భారత బలగాలు వెనక్కి తెస్తాయని కానీ, ఎవరూ భయపడవద్దని కానీ నెహ్రూ చెప్పి ఉండాల్సింది'' అని రిజిజు ఆనాటి పరిస్థితిని వివరించారు.


''చైనా దురాక్రమణల గురించి గత రెండు మూడేళ్లుగా కాంగ్రెస్ మాట్లాడుతూనే ఉంది. 1959లో అరుణాచల్‌ భూభాగాన్ని చైనా ఆక్రమించిన విషయాన్ని నేను చెప్పదలచుకున్నాను. అరుణాచల్‌లో చైనా ఆక్రమించుకున్న భూముల్లో గ్రామాలను ఏర్పాటు చేసింది. నేను ఇచ్చే వివరణతో రాహుల్‌, కాంగ్రెస్ ఎంపీలు ఏకీభవించకపోవచ్చు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియగానే మీరు నాతో అరుణాచల్ ప్రదేశ్ రండి. అక్కడి ప్రతి అంగుళం భూమి మీకు చూపిస్తాను'' అని రిజిజు పేర్కొన్నారు.


ఆ రోజులు పోయాయి...

ఇండియా ఏం చేయాలో ఏమి చేయకూడదో విదేశీ శక్తులు శాసించే రోజులు పోయాయని రిజిజు ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఏ విదేశీ శక్తి కూడా మన అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం జోసుకోలేదని అన్నారు. 2014కు ముందు ఈశాన్య ప్రాంతాల ప్రజలు ఢిల్లీతో సహా దేశంలోని కీలక సిటీల్లో వివక్షకు, అకృత్యాలకు గురయ్యేవారని, 2014లో మోదీ జోక్యంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిదని వివరించారు. I.N.D.I.A. కూటమి పేరు పెట్టుకుని ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఒరిగేదేమీ ఉండదని విపక్ష కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-08-08T19:30:57+05:30 IST