Karnataka HC : ఈషా యోగా సెంటర్ సంక్రాంతి కార్యక్రమాలు... హైకోర్టు వివరణ...

ABN , First Publish Date - 2023-01-13T17:07:10+05:30 IST

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్‌లో ఈషా యోగా సెంటర్ వద్ద భూమి స్వభావాన్ని మార్చకూడదని, ప్రస్తుత స్థితిని యథాతథంగా

Karnataka HC : ఈషా యోగా సెంటర్ సంక్రాంతి కార్యక్రమాలు... హైకోర్టు వివరణ...
Isha Foundation founder Sadhguru Jaggi Vasudev

బెంగళూరు : కర్ణాటకలోని చిక్కబల్లాపూర్‌లో ఈషా యోగా సెంటర్ వద్ద భూమి స్వభావాన్ని మార్చకూడదని, ప్రస్తుత స్థితిని యథాతథంగా కొనసాగించాలని జనవరి 11న ఇచ్చిన తాత్కాలిక ఆదేశాల ప్రభావం జనవరి 15న ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాలపై ఉండదని కర్ణాటక హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. సంక్రాంతి సందర్భంగా జరిగే ఈ కార్యక్రమాల్లో ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ (Jagdeep Dhankhar) పాల్గొంటారు.

నంది హిల్స్ వద్దనున్న ఈషా యోగా సెంటర్‌ లో జనవరి 15న సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఈషా ఫౌండేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ అడవుల ధ్వంసం, నిర్మాణ కార్యక్రమాల కోసం చెట్ల నరికివేత వంటివాటికి పాల్పడకూడదని హైకోర్టు (Karnataka High Court) జనవరి 11న తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము అడవుల నరికివేత, నిర్మాణ పనులు వంటివాటిని చేపట్టబోమని, కేవలం ఉప రాష్ట్రపతి పాల్గొనే ఈ కార్యక్రమం సజావుగా జరగడం కోసం అవసరమైన కొన్ని పనులను మాత్రమే చేస్తామని ఈషా యోగా సెంటర్ వ్రాతపూర్వకంగా హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ స్పందిస్తూ, జనవరి 11న ఇచ్చిన తాత్కాలిక ఆదేశాల ప్రభావం సంక్రాంతినాడు జరిగే ఈషా యోగా సెంటర్ కార్యక్రమాలపై ఉండబోదని వివరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బీ వరలే, జస్టిస్ అశోక్ ఎస్ కినగి డివిజన్ బెంచ్ ఈ వివరణ ఇచ్చింది.

ఈషా యోగా సెంటర్‌ (Isha Yoga Centre)కు భూమి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎస్ కయతప్ప, మరో ముగ్గురు రైతులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రెవిన్యూ, అటవీ, గాలి, నీరు సంబంధిత చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ భూ కేటాయింపు జరిగిందని ఆరోపించారు. సంక్రాంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనే ముసుగులో అడవులను ధ్వంసం చేయరాదని, నిర్మాణాలు చేపట్టరాదని వాదించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్లను నిర్మించారని, రాజకీయ పలుకుబడే దీనికి కారణమని ఆరోపించారు. పిటిషనర్ల తరపున ప్రశాంత్ భూషణ్, ఈషా యోగా సెంటర్ తరపున ఉదయ్ హొల్లా వాదనలు వినిపించారు.

Updated Date - 2023-01-13T17:07:17+05:30 IST