Share News

DK Shivakumar: డీకేపై సీబీఐ దర్యాప్తు ఉపసంహరణకు కేబినెట్ నిర్ణయం.. భగ్గుమన్న విపక్షాలు

ABN , First Publish Date - 2023-11-24T16:45:16+05:30 IST

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై సీబీఐ జరుపుతున్న దర్యాప్తును ఉపసంహరించుకుంటూ రాష్ట్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అధికార కాంగ్రెస్ సమర్ధించుకోగా, విపక్షాలు మండిపడ్డాయి.

DK Shivakumar: డీకేపై సీబీఐ దర్యాప్తు ఉపసంహరణకు కేబినెట్ నిర్ణయం.. భగ్గుమన్న విపక్షాలు

బెంగళూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK shivakumar)పై సీబీఐ (CBI) జరుపుతున్న దర్యాప్తును ఉపసంహరించుకుంటూ రాష్ట్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అధికార కాంగ్రెస్ సమర్ధించుకోగా, విపక్షాలు మండిపడ్డాయి.


చట్టవిరుద్ధం: బీజేపీ

డీకే శివకుమార్‌పై సీబీఐ దర్యాప్తును ఉపసంహరించుకుంటూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. లీగల్ ప్రక్రియపై నమ్మకం ఉంచాలే కానీ, ఇలాంటి క్యాబినెట్ నిర్ణయాలని కాదని, మంత్రివర్గ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలోనూ, ఇతర రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలు సీజ్ చేశారని, ఈ మొత్తం వ్యవహారంపై ఈడీ విచారణ జరుపుతోందని, ఆ క్రమంలో మంత్రివర్గం నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆక్షేపించారు.


కుమారస్వామి మండిపాటు..

క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తప్పుపట్టారు. బందిపోటులను రక్షించేందుకే ఈ ప్రభుత్వం (కాంగ్రెస్) ఉందని ఘాటుగా విమర్శించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున అంతకు మించి మాట్లాడలేమన్నారు. కొందరు వ్యక్తులకు కోర్టులంటే మామాత్రం ఖాతరు లేకపోవడం సిగ్గుచేటని అన్నారు.


నాకు తెలియదన్న డీకే, సరైన నిర్ణయమేనని చెప్పిన సీఎం

కాగా, సీబీఐ దర్యాప్తును ఉపసంహరించుకుంటూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం గురించి తనకు తెలియదని డీకే చెప్పారు. వార్తాపత్రికల్లోనే ఈ విషయం చూసానని తెలిపారు. మంత్రివర్గ సమావేశానికి తాను వెళ్లలేదని, తెలంగాణలో రెండు రోజుల ప్రచారానికి వెళ్తున్నానని చెప్పారు. అయితే, డీకేపై సీబీఐ దర్యాప్తును ఉపసంహరించుకోవాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాకు తెలిపారు.


కాంగ్రెస్ సమర్ధన..

మరోవైపు, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్ధించింది. రాజకీయ దురుద్దేశాలతోనే డీకేపై కేసు పెట్టారని పేర్కొంది. ''బెదిరించడం మాత్రమే బీజేపీకి తెలుసు. డీకేపై కేసుకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా, ఏజెన్సీల ద్వారా గురువారం నుంచి ఇలాంటి బెదిరింపులే చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్, సిద్ధరామయ్య, డీకేను తమ కంట్రోల్‌లో పెట్టుకోవాలని బీజేపీ అనుకుంటోంది'' అని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే అన్నారు. హోం మంత్రి జి.పరమేశ్వర మాట్లాడుతూ, చట్టపరిధిలోనే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై సీబీఐ ఏం చేస్తుంది, కోర్టులు ఏం చేస్తాయనేది తదుపరి విషయమని అన్నారు. బీజేపీ-జేడీఎస్ ఎలాంటి భాష్యాలు చెప్పినా అది వారికే విడిచిపెడుతున్నామని తెలిపారు. చట్టం ప్రకారమే తాము చేయాల్సింది చేసామని చెప్పారు.


హైకోర్టులో కేసు విచారణ 29కి వాయిదా

కాగా, అక్రమ ఆస్తుల కేసులో గత ప్రభుత్వం సీబీఐ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ డీకే శివకుమార్ వేసిన పిటిషన్‌పై విచారణను కర్ణాటక హైకోర్టు నవంబర్ 29కి వాయిదా వేసింది.

Updated Date - 2023-11-24T16:45:17+05:30 IST