2024 Lok Sabha Elections: నడ్డాపై అంత నమ్మకం ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-01-17T19:01:55+05:30 IST

నిజానికి బీజేపీలో కానీ ప్రభుత్వంలో కానీ మోదీ-షా మాటే ఫైనల్. అయితే వీరిద్దరితోనూ నడ్డా సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా పార్టీని నడిపిస్తున్నారు.

2024 Lok Sabha Elections: నడ్డాపై అంత నమ్మకం ఎందుకంటే?
JP Naddas term extended as BJP President

న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల(2024 Lok Sabha Elections)తో పాటు 2023లో జరిగే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షునిగా జేపీ నడ్డా (JP Nadda) పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగిస్తూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. 2019లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నడ్డా 2020లో పూర్తి కాలపు అధ్యక్ష పదవిని చేపట్టారు. వాస్తవానికి నడ్డా పదవీకాలం ఈ నెలలో పూర్తి కానుంది. తిరిగి నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగించాలని కమలనాథులు నిర్ణయించారు. అగ్రనేత అద్వానీ, అమిత్ షాల తర్వాత వరుసగా రెండోసారి బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగనున్నారు.

నడ్డా ప్రస్థానమిదే!

1970లో పాట్నాలో ఏబీవీపీలో చేరడం ద్వారా నడ్డాకు సంఘ్ పరివార్‌‌తో అనుబంధం ఏర్పడింది.1986 నుంచి 89 వరకూ ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1991లో బీజేవైఎం అధ్యక్షుడిగా పనిచేశారు. 1993లో తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌‌లోని బిలాస్‌పూర్‌నుంచి అసెంబ్లీకి గెలిచారు. తర్వాత 1998లోనూ గెలిచారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. 2014లో మోదీ ప్రభుత్వ హయాంలోనూ ఆయన కేంద్ర ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. 2019లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు.

మోదీ-షా-నడ్డా సక్సెస్‌ఫుల్ టీమ్

నిజానికి బీజేపీలో కానీ ప్రభుత్వంలో కానీ మోదీ-షా మాటే ఫైనల్. అయితే వీరిద్దరితోనూ నడ్డా సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా పార్టీని నడిపిస్తున్నారు. పార్టీ నుంచి ప్రభుత్వానికి ఏ తలనొప్పులూ రాకుండా నడ్డా చూసుకుంటున్నారు. 2014, 2019 ఎన్నికల తర్వాత జరగబోయే 2024 ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో మోదీ-షా-నడ్డా త్రయం వ్యూహాలను అమలు చేయడంలో వరుసగా విజయవంతమౌతూ వస్తోంది. కోవిడ్ సమయంలో కూడా పార్టీని నడ్డా సమర్థంగా నడిపారు. సేవా హి సంఘటన్ పేరుతో కోవిడ్ వేళ బీజేపీ తరపున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు నడ్డా శ్రీకారం చుట్టారు. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేశారు.

నడ్డాకు అండగా షా

నడ్డా నాయకత్వంలో తాము బిహార్‌లో అత్యధిక స్ట్రైక్ రేటును సాధించామని, మహారాష్ట్రలో ఎన్డీయే విజయం సాధించిందని, ఉత్తర ప్రదేశ్‌లో తాము గెలిచామని, పశ్చిమ బెంగాల్‌లో తమ బలం పెరిగిందని కేంద్ర హోం మంత్రి షా చెప్పారు. హర్యానా, అస్సాం, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాతో పాటు ఇటీవల గుజరాత్‌లో భారీ విజయాన్ని సాధించామన్నారు.

కేంద్రంలో మూడోసారి అధికారమే నడ్డా టార్గెట్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రసంగించిన జేపీ నడ్డా తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో 9 రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా ఓడిపోకూడదని పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టేందుకు ఈ రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. 2024 ఎన్నికల ముంగిట పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్టు నడ్డా తెలియజేశారు. ప్రధాని మోదీ సారథ్యంలో భారత పురోగతిని ఆయన ప్రశంసించారు. ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా.. మొబైల్‌ ఫోన్ల ఉత్పాదనలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా, ఆటో రంగంలో మూడో అతిపెద్ద మాన్యుఫ్యాక్చరర్‌గా దేశం అవతరించిందన్నారు. రోజుకు 37 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని, గతంలో ఇది 12 కిలోమీటర్లు మాత్రమేనని, ఉచిత రేషన్‌ సహా పలు సంక్షేమ పథకాలతో పేదలకు సాధికారత అందిస్తున్నామన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో అసాధారణ, చరిత్రాత్మక విజయం సాధించామని నడ్డా చెప్పారు. 182 అసెంబ్లీ స్థానాల్లో 156 గెలవడం గొప్ప విజయమని, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఓట్ల తేడా ఒక శాతం కంటే తక్కువేనని నడ్డా గుర్తుచేశారు. 9 రాష్ట్రాల్లో 72 వేల బూత్‌లలో పార్టీ బలహీనంగా ఉన్నదని, కష్టపడి పనిచేస్తే అన్ని రాష్ట్రాల్లో విజయం ఖాయమని నడ్డా చెప్పారు. 2023 బీజేపీకి అత్యంత ముఖ్యమైన సంవత్సరమన్నారు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే నడ్డాకు కీలక పదవి దక్కే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2023-01-17T19:03:21+05:30 IST