Share News

Pension: 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం..సీఎం సంచలన ప్రకటన

ABN , Publish Date - Dec 29 , 2023 | 06:55 PM

వృధ్ధాప్య పింఛన్ల విషయంలో జార్ఖండ్‌ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో 60 ఏళ్లు ఉన్న పింఛన్ అర్హత వయస్సును కాస్తా ఏకంగా 10 ఏళ్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

Pension: 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం..సీఎం సంచలన ప్రకటన

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వృద్ధాప్య పింఛన్ల విషయంలో సంచలన ప్రకటన చేశారు. దళితులు, గిరిజనులకు వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 60 నుంచి 50 ఏళ్లకు తగ్గిస్తామన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో కార్యాలయాలను ఏర్పాటు చేసే కంపెనీలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాంచీలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా హేమంత్ సోరెన్ ఈ మేరకు పేర్కొన్నారు.


గత 20 ఏళ్లలో గత ప్రభుత్వం కేవలం 20 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చిందని హేమంత్ అన్నారు. కానీ గత 4 ఏళ్లలోనే తమ ప్రభుత్వం 36 లక్షల 20 వేల మందికి పింఛన్ ఇచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయని అన్నారు. అందులో తండ్రికి 98 సంవత్సరాలు, కుమారుడికి 60 సంవత్సరాలు ఉంటున్నాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ పెన్షన్ పొందుతూ సంతోషంగా ఉంటున్నట్లు చెప్పారు. మారుతున్న పరిస్థితుల కారణంగా అనేక మంది 50 ఏళ్లకే అనారోగ్యం బారిన పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అనేక మందికి ఊరట లభించనుంది. మరోవైపు ఈ నిర్ణయంతో మిగిలిన రాష్ట్రాల్లో కూడా మార్పు వస్తుందా లేదా అనేది చూడాలి.

అయితే ఈ పింఛన్ల నిర్ణయం అమలు చేస్తే ఇదొక సంచలనం అవుతుంది. దీంతో దేశంలోనే తక్కువ వయస్సులోనే పింఛన్లను ఇస్తున్న రాష్ట్రం జార్ఖండ్‌ కానుంది. ప్రస్తుతం తెలంగాణలో పింఛన్లను గతంలో 60 ఏళ్ల ఉండగా..57 ఏళ్లకే ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ప్రస్తుతం 60 ఏళ్లకు వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారు.

Updated Date - Dec 29 , 2023 | 06:55 PM