Share News

Article 370: జమ్మూ కశ్మీర్‌లో ఆ సమయానికల్లా ఎన్నికలు నిర్వహించాలి.. ఈసీని ఆదేశించిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2023-12-11T13:07:20+05:30 IST

జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370(Article 370) రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court Judgement) తీర్పు వెలువరించిన తరుణంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించింది.

Article 370: జమ్మూ కశ్మీర్‌లో ఆ సమయానికల్లా ఎన్నికలు నిర్వహించాలి.. ఈసీని ఆదేశించిన సుప్రీంకోర్టు

కశ్మీర్: జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370(Article 370) రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court Judgement) తీర్పు వెలువరించిన తరుణంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. కశ్మీర్ రాష్ట్ర హోదాను త్వరగా పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. 2024 సెప్టెంబర్ 30కల్లా ఎన్నికలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2019 ఆగస్టులో లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా విభజించాలనే నిర్ణయాన్ని సమర్థించింది. తీర్పు నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని బీజేపీ కోరింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ కూటమిగా జమ్ము-కశ్మీర్ పార్టీలు ఏర్పడ్డాయి. గుప్కార్ అలయన్స్ పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ఏడాది ఆగస్ట్ 2 నుంచి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పలు జమ్ము-కాశ్మీర్ రాజకీయ పార్టీలు సుప్రీంను ఆశ్రయించాయి.


సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యమైన అంశాలు...

1. భారత యూనియన్‌లో చేరినప్పుడు జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమత్వం లేదు: సీజేఐ

2. భారత రాజ్యాంగంలోని ప్రతి నిబంధనను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి అవసరం లేదు: సీజేఐ

3. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన. రాష్ట్రంలో యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు: సీజేఐ

4. జమ్మూకాశ్మీర్ కూడా అన్ని రాష్ట్రాల లాంటిదే. ఇతర రాష్ట్రాలకు విభిన్నంగా అంతర్గత సార్వభౌమాధికారం లేదు. ఈ మేరకు రాజ్యాంగంలో కూడా ప్రస్తావన లేదు: సీజేఐ

5. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా పునర్‌వ్యవస్థీకరించడం సమర్థనీయం: సీజేఐ

6. ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చవచ్చా? లేదా? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు: సీజేఐ

7. ఆర్టికల్ 370 రద్దు సరైనదే. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు సమర్థనీయమే: సీజేఐ

8.ఆర్టికల్ 370 ముఖ్య ఉద్దేశ్యం జమ్మూ కాశ్మీర్‌ను నెమ్మదిగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా తీసుకురావడమే: జస్టిస్ కౌల్

9. డొంక దారిలో నిబంధనల సవరణ సరికాదు. ఒక విధానాన్ని సూచించినప్పుడు దానిని తప్పకుండా అనుసరించాలి: ఆర్టికల్ 367 ఉపయోగించి ఆర్టికల్ 370 సవరణ ప్రక్రియ చేపట్టడంపై జస్టిస్ కౌల్

10. ప్రభుత్వం ‘నిష్పాక్షిక నిజం, సయోధ్య కమిటీ’ని (The Truth and Reconciliation Commission) ఏర్పాటు చేయాలి. ఈ అంశంతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి: జస్టిస్ కౌల్ సిఫార్సు

Updated Date - 2023-12-11T13:08:03+05:30 IST