Khalistan terrorists : సిక్కు తీవ్రవాదుల నిరసనలపై కెనడాను హెచ్చరించిన భారత్

ABN , First Publish Date - 2023-07-04T09:52:10+05:30 IST

ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థలు భారత దేశ జాతీయ పతాకాన్ని అవమానించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కెనడాను కోరింది. కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద ఈ నెల 8న నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వానికి అధికారికంగా ఓ లేఖ రాసింది.

Khalistan terrorists : సిక్కు తీవ్రవాదుల నిరసనలపై కెనడాను హెచ్చరించిన భారత్

న్యూఢిల్లీ : ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థలు భారత దేశ జాతీయ పతాకాన్ని అవమానించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కెనడాను కోరింది. కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద ఈ నెల 8న నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వానికి అధికారికంగా ఓ లేఖ రాసింది.

కెనడాలోని ఒట్టావాలో ఉన్న ఇండియన్ హైకమిషన్ కార్యాలయం, టొరంటో, వాంకోవర్ నగరాల్లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాల వద్ద ఈ నెల 8న నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని ఖలిస్థాన్ అనుకూల సిక్కు ఉగ్రవాద సంస్థలు ప్రకటించాయి. దీనిపై భారత ప్రభుత్వం మంగళవారం స్పందిస్తూ, జస్టిన్ ట్రుడు నేతృత్వంలోని కెనడా ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. సిక్కు ఉగ్రవాదులు భారత దేశ జాతీయ పతాకాన్ని అవమానించకుండా, ఇండియన్ మిషన్స్, కాన్సులేట్లకు సమీపంలో ఈ ఉగ్రవాదులు చేరుకోకుండా, ఈ కార్యాలయాల్లో పని చేసే దౌత్యవేత్తలు, ఇతర సిబ్బందికి ఎటువంటి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరింది. ప్రహరీ గోడలపై ఎటువంటి కరపత్రాలు అంటించకుండా, రాతలు రాయకుండా, ప్రొజెక్టైల్స్‌ను కార్యాలయాల్లోకి విసరకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

న్యూఢిల్లీలోని కెనడియన్ హైకమిషనర్‌ను సోమవారం భారత ప్రభుత్వం పిలిచి, సిక్కు ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు నోట్ వెర్బల్ (లేఖ)ను మంగళవారం గ్లోబల్ ఎఫైర్స్ కెనడాకు మంగళవారం ఉదయం పంపించింది. ఈ ఏడాది మార్చి 23న సిక్కు ఉగ్రవాదులు ఇండియన్ హై కమిషన్ ప్రాంగణంలోకి రెండు స్మోక్ గ్రెనేడ్లను విసిరినట్లు గుర్తు చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాదులు టొరంటో, వాంకోవర్ నగరాల్లో నిరసనల సందర్భంగా భారత దేశ జాతీయ పతాకాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.

అమెరికాలోని ప్రకటిత ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (Sikhs for justice) ఈ నిరసనలను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ప్రధాన అనుబంధ సంస్థ కెనడాలో ఉంది. ఈ సంస్థకు చెందిన నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలోని వాంకోవర్‌లో జూన్ 19న హత్య చేశారు. ఇంటర్ గ్యాంగ్ ఘర్షణలో ఈ హత్య జరిగినప్పటికీ, ఇది భారత దేశ అధికారుల పనేనని ఎస్ఎఫ్‌జే ఆరోపిస్తూ, సిక్కు యువతను రాడికలైజ్ చేస్తోంది. పాశ్చాత్య దేశాల్లోని భారతీయ మూలాలుగలవారిపైకి వీరిని ఉసిగొలుపుతోంది. నిజ్జర్ హత్యకు కారకులు ఇండియన్ హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, వాంకోవర్ కాన్సుల్ జనరల్ మనీశ్, టొరంటో కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ అని కరపత్రాలను పంచుతోంది. ఎస్ఎఫ్‌జే ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను కార్యకలాపాల్లో భాగంగానే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌పై దాడి జరిగింది. ఈ ఉగ్రవాదికి కెనడా, యూకే తదితర పాశ్చాత్య దేశాల్లో ప్రాపకం లభిస్తోంది. అక్కడి ప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి.

ఇండియన్ హై కమిషనర్‌కు, ఇద్దరు కాన్సుల్ జనరల్స్‌కు భద్రత కల్పించాలని కెనడాలోని ఇండియన్ హై కమిషన్ ఆ దేశ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ముప్పు తీవ్రత తగ్గే వరకు, ముఖ్యంగా ఈ అధికారులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేటపుడు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరారు.

నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం ముందుగా హెచ్చరిస్తున్నప్పటికీ కెనడా, బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలు సిక్కు ఉగ్రవాదుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. వారికి నిరసన తెలిపే హక్కు ఉందని చెప్తున్నాయి. అయితే జూలై ఎనిమిదిన జరిగే నిరసనల్లో భారత దేశ జాతీయ పతాకాన్ని అవమానించినా, తగులబెట్టినా తీవ్రంగా పరిగణించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి :

BJP state president: ‘గో బ్యాక్‌ సీఎం’ బెలూన్లతో నిరసన తెలుపుతాం..

యూసీసీ నుంచి గిరిజనులకు మినహాయింపు!

Updated Date - 2023-07-04T09:52:10+05:30 IST