Share News

Madypradesh: మధ్యప్రదేశ్‌లో 81 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. ఎక్కువ మంది బీజేపీకి చెందిన వారే

ABN , First Publish Date - 2023-10-20T12:49:37+05:30 IST

దేశంలోని అయిదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళా.. ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధుల ఆస్తులు, వ్యక్తిగత వివరాలను పలు సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ సర్వే సంస్థ మధ్యప్రదేశ్ కి చెందిన ఓ ఆసక్తికర నివేదికను ప్రకటించింది.

Madypradesh: మధ్యప్రదేశ్‌లో 81 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. ఎక్కువ మంది బీజేపీకి చెందిన వారే

ఢిల్లీ: దేశంలోని అయిదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధుల ఆస్తులు, వ్యక్తిగత వివరాలను పలు సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ సర్వే సంస్థ మధ్యప్రదేశ్ కి చెందిన ఓ ఆసక్తికర నివేదికను ప్రకటించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) నివేదికలోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 186 (81 శాతం) మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. 230 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.10.76 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని, ఇది 2013 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ఆస్తుల కంటే 105 శాతం ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. 2008 ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యేల(కోటీశ్వరులు) సంఖ్య 84 ఉండగా, అది 2013 నాటికి 161కి చేరింది. 2018 ఎన్నికల్లో ఆ సంఖ్య మరింతగా పెరిగి 186కు చేరింది. 129 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలలో 107 (83%) మంది కోటీశ్వరులు కాగా, 97 మంది కాంగ్రెస్ శాసనసభ్యులలో 76 మంది (78%) కోటీశ్వరులు. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ముగ్గురు కోటీశ్వరులే. ఆ రాష్ట్రంలో సామాన్యుడి తలసరి ఆదాయం నెలకు రూ.11 వేలుగా ఉంది.


అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఆయనే..

మధ్యప్రదేశ్ కి చెందిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.226 కోట్లు ఉంటుందని నివేదిక అంచనా వేసింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ ధనిక ఎమ్మెల్యేల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.124 కోట్లు. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2018 ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం రూ. 7 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యల్ప ఆస్తులు కలిగి ఉన్నారు.

40 శాతం ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు..

నివేదిక ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని 40% మంది శాసనసభ్యులపై క్రిమినల్ కేసులు ఉండగా.. 20% మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. అధికార బీజేపీలో మొత్తం 129 మంది ఎమ్మెల్యేల్లో 30% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, 16% ఎమ్మెల్యేలు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కాంగ్రెస్‌లో మొత్తం 97 మంది ఎమ్మెల్యేలలో 54% మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 26% మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.


ఎమ్మెల్యేల విద్యార్హత...

మధ్యప్రదేశ్‌లో 230 మంది ఎమ్మెల్యేలలో 59 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు ఉన్నారని, వీరిలో 35 మంది బీజేపీకి, 24 మంది కాంగ్రెస్‌కు చెందిన వారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 55 మంది శాసనసభ్యులు (బీజేపీ నుండి 28, కాంగ్రెస్ నుండి 26, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే) గ్రాడ్యుయేట్లు కాగా, 39 (బీజేపీ నుండి 25, కాంగ్రెస్ నుండి 13, ఒక స్వతంత్రుడు) గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్ అని నివేదిక పేర్కొంది. 230 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు (నలుగురు బీజేపీ, ఒకరు కాంగ్రెస్) డాక్టరేట్‌లు కాగా, నలుగురు (బీజేపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఒకరు స్వతంత్రులు) ప్రొఫెషనల్ డిప్లొమా హోల్డర్లు. 35 మంది ఎమ్మెల్యేలు 12వ తరగతి ఉత్తీర్ణులు, 12 మంది శాసనసభ్యులు 10వ తరగతి ఉత్తీర్ణులు, ఏడుగురు 8వ తరగతి ఉత్తీర్ణులు, ఎనిమిది మంది 5వ తరగతి ఉత్తీర్ణులు, ఐదుగురు (నలుగురు బీజేపీ, ఒక బీఎస్పీ) అక్షరాస్యులు కాగా, ఒక బీజేపీ ఎమ్మెల్యే నిరక్షరాస్యుడు.

Updated Date - 2023-10-20T12:49:37+05:30 IST