Pakistan : పాకిస్థాన్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐఎంఎఫ్

ABN , First Publish Date - 2023-01-25T14:40:50+05:30 IST

పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ దయనీయ స్థితి నుంచి అత్యంత దీనావస్థకు చేరుకుంటున్న సమయంలో ఆ దేశానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ

Pakistan : పాకిస్థాన్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐఎంఎఫ్
IMF , Pakistan

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ దయనీయ స్థితి నుంచి అత్యంత దీనావస్థకు చేరుకుంటున్న సమయంలో ఆ దేశానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి సహాయక బృందాలను పంపించేందుకు నిరాకరించింది. సమీక్షను పూర్తి చేయడానికి సహాయక బృందాన్ని పంపించాలని పాకిస్థాన్ విన్నవించినప్పటికీ ఐఎంఎఫ్ కనికరించలేదు.

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ సహాయపడుతుందని చాలా మంది ఊహించారు. కానీ ఆ దేశ వినతిని ఐఎంఎఫ్ తోసిపుచ్చింది. పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్‌ ‌ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు అత్యంత కనిష్ఠ స్థాయికి అంటే 4.343 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఆ దేశానికి అవసరమైన నిత్యావసరాలను కొనేందుకు ఈ సొమ్ము కేవలం రెండు వారాల వరకు మాత్రమే సరిపోతుంది. ముఖ్యంగా చమురును దిగుమతి చేసుకోవడానికి ఈ సొమ్మును వెచ్చించవలసి ఉంటుంది.

పాకిస్థాన్‌కు 2019లో 6 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ లభించింది. ఈ ఏడాది ప్రారంభంలో 1 బిలియన్ డాలర్లు వచ్చింది. ఈ సొమ్ము సరిపోకపోవడంతో తమను ఆదుకోవాలని ఐఎంఎఫ్‌తోపాటు మరికొన్ని దేశాలను పాకిస్థాన్ (Pakistan) ఆశ్రయించింది.

మరోవైపు గ్యాస్ ధరలు 70 శాతం, విద్యుత్తు ఛార్జీలు 30 శాతం చొప్పున పెరిగాయి. ప్రధాన ఆహారమైన గోధుమ పిండి కోసం ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు అనుభవిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించాలని పాకిస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. అదే విధంగా మంత్రిత్వ శాఖల ఖర్చుల్లో 15 శాతం తగ్గించుకోవడంపై పరిశీలిస్తోంది. ఫెడరల్ మంత్రుల సంఖ్యను కూడా తగ్గించాలని ఆలోచిస్తోంది.

Updated Date - 2023-01-25T14:40:54+05:30 IST