Share News

Digvijaya Singh: రామాలయ నిర్మాణానికి సీఎం కంటే ఎక్కువ విరాళం ఇచ్చా: దిగ్విజయ్

ABN , First Publish Date - 2023-10-29T17:40:43+05:30 IST

సనాతన ధర్మాన్ని తాను పాటిస్తున్నానని, తాను ఒక మంచి హిందువునని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఎన్నికల్లో మత ప్రస్తావనపై నిషేధం ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూనే, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తాను రూ.1.11 లక్షలు విరాళంగా ఇచ్చానని చెప్పారు.

Digvijaya Singh: రామాలయ నిర్మాణానికి సీఎం కంటే ఎక్కువ విరాళం ఇచ్చా: దిగ్విజయ్

భోపాల్: సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) తాను పాటిస్తున్నానని, తాను ఒక మంచి హిందువునని (Good hindu) కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya singh) చెప్పారు. ఎన్నికల్లో మత ప్రస్తావనపై నిషేధం ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూనే, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తాను రూ.1.11 లక్షలు విరాళంగా ఇచ్చానని చెప్పారు.


ఆదివారంనాడు భోపాల్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ...''రామాలయ నిర్మాణానికి శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్ సీఎం) రూ.లక్ష విరాళం ఇచ్చారు. నేను రూ.1.11 లక్షలు ఇచ్చాను. విరాళం చెక్కును ట్రస్టుకు సమర్పించాలని కోరుతూ ప్రధానమంత్రి మోదీకి పంపాను. ఆయన స్వయంగా మీరే ఇవ్వండంటూ నాకు తిరిగి పంపారు. ఆ చెక్కుకు ట్రస్టుకు అందజేశాను'' అని దిగ్విజయ్ తెలిపారు. నవరాత్రులు చివరిరోజు శివరాజ్ సింగ్ చౌహాన్ ''కన్యా పూజ'' చేయడంపై దిగ్విజయ్‌కు, ఆయనకు మధ్య మాటల యుద్ధం జరిగిన వారం రోజుల్లోపే డిగ్గీ రాజా తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


దిగ్విజయ్ వర్సెస్ శివరాజ్

శివరాజ్ సింగ్ నాటకాలు ఆడటంలో చాలా నేర్పరని డిగ్గీ గత వారం విమర్శించారు. ''ఆయన గురించి మాట్లాడకండి. అలాంటి అబద్ధాల సీఎంను నేను ఎప్పుడూ చూడలేదు. ఎన్ని నాటకాలైనా వేస్తారు. ఆయనను చూసి ప్రధాని కూడా ఇప్పుడు బెదురుతున్నారు'' అని ఘాటు విమర్శలు చేశారు. దీనిపై సీఎం శివరాజ్ సింగ్ వెంటనే ప్రతిస్పందించారు. యావద్దేశం కన్యాపూజ జరుపుతుంటే, దిగ్విజయ్‌కు మాత్రం ఇదంతా నాటకంలా కనిపిస్తోందని, మహిళలకు గౌరవం ఇవ్వడాన్ని ఇలాంటి వాళ్లు సహించ లేరని అన్నారు. మన ఆడపిల్లలను పూజించడం నాటకం అవుతుందా అనే విషయాన్ని మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీని అడిగితే బాగుంటుందని, ఈ విషయంలో కాంగ్రెస్ తమ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17న జరుగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-10-29T17:40:43+05:30 IST