Share News

High Court bench: ఆన్‌లైన్‌ జూదాల నిషేధ చట్టం చెల్లుబాటే!

ABN , First Publish Date - 2023-11-10T08:59:16+05:30 IST

ఆన్‌లైన్‌ జూదాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలో శాసనసభలో ఆమోదించిన ప్రత్యేక చట్టం న్యాయసమ్మతేమనని

High Court bench: ఆన్‌లైన్‌ జూదాల నిషేధ చట్టం చెల్లుబాటే!

- హైకోర్టు ధర్మాసనం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ జూదాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలో శాసనసభలో ఆమోదించిన ప్రత్యేక చట్టం న్యాయసమ్మతేమనని మద్రాసు హైకోర్టు(Madras High Court) గురువారం తీర్పు వెలువరించింది. ఏప్రిల్‌లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆమోదించిన ఆ చట్టంలో ప్రతిభ నైపుణ్యాల ప్రాతిపదికన ఎలాంటి నగదు బెట్టింగ్‌ లేకుండా జరిపే రమ్మీ, పోకర్‌ వంటి ఆన్‌లైన్‌ క్రీడలను నిషేధించేందుకు వీలు కల్పించే సెక్షన్లను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. ఆన్‌లైన్‌ జూదాల నిషేధ చట్టానికి వ్చతిరేకంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆలిండియా స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ తరఫున హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం కల్పించిన అధికారాల ప్రకారమే ఈ చట్టాన్ని రూపొందించినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆన్‌లైన్‌ క్రీడలవల్ల యువకులు, దినకూలీలు, ఆటో డ్రైవర్లు, పోలీసులు అంటూ సుమారు 32 మంది దాకా ఆస్తిపాస్తులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ అంశాలను సమగ్రంగా పరిశీలించిన మీదటే ఆన్‌లైన్‌ జూదాల నిషేధ చట్టం తీసుకువచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాద ప్రతివాదనల తర్వాత ప్రధాన న్యాయమూర్తి గంగాపూర్‌వాలా, న్యాయమూర్తి ఆదికేశవులతో కూడిన ప్రధమ ధర్మాసనం నగదు బెట్టింగ్‌లతో, అదృష్టమే ప్రధాన ప్రాతిపదికగా నిర్వహించే ఆన్‌లైన్‌ జూదాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటు అవుతుందని తీర్పు వెలువరించారు.

Updated Date - 2023-11-10T08:59:27+05:30 IST