Share News

Heavy Rains: భారీవర్షాలకు దక్షిణాది జిల్లాలు అస్తవ్యస్తం

ABN , Publish Date - Dec 20 , 2023 | 08:49 AM

కుండపోత వర్షాల కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్నియాకుమారి(Tirunalveli, Thoothukudi, Thenkasi, Kanniyakumari) జిల్లాలు

Heavy Rains: భారీవర్షాలకు దక్షిణాది జిల్లాలు అస్తవ్యస్తం

- మూడో రోజూ అంధకారంలోనే ఆ నాలుగు జిల్లాలు

- తూత్తుకుడిలో 70 పడవలతో సహాయక చర్యలు

- జలదిగ్బంధంలో శ్రీవైకుంఠంవాసులు

- హెలికాప్టర్లలో ఆహారపొట్లాల పంపిణీ

- సురక్షిత ప్రాంతాలకు 11 వేలమంది

- రెండో రోజు విమాన, బస్సు సేవల రద్దు

- అధికారులతో గవర్నర్‌ సమీక్ష

- నేడు స్టాలిన్‌ పర్యటన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కుండపోత వర్షాల కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్నియాకుమారి(Tirunalveli, Thoothukudi, Thenkasi, Kanniyakumari) జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. మూడు రోజులుగా వీడని గాఢాంధకారంతో వరదనీటిలో మగ్గిపోతున్నాయి. ప్రభుత్వం పలు రకాల సహాయక చర్యలు చేపట్టినా, అవి ఏమాత్రం సరిపోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు జిల్లాలో వరదల కారణంగా పదిమంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించగా, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు. తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో 25 శాతం వరద బాధిత ప్రాంతాలు కోలుకున్నట్లు కనిపిస్తున్నాయి. మూడురోజులపాటు భయపెట్టిన వరుణదేవుడు కాస్త విరామం ఇవ్వడంతో నాలుగు జిల్లాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే పడ్డాయి. ఈ జిల్లాల్లో 12 మంది మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, సైనిక, విమాన, నావికాదళం సభ్యులు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. అదే సమయంలో ప్రధానమైన ప్రాంతాల్లో ఇంకా మోకాలిలోతు వరదనీరు రహదారుల్లో పొంగి ప్రవహిస్తున్నాయి. అరవై శాతానికి పైగా ప్రాంతాల్లో గత మూడు రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. తిరునల్వేలి జిల్లాల్లో గత రెండు రోజులుగా పొంగి ప్రవహించిన తామ్రభరణి నది కాస్త నెమ్మదించింది. తిరునల్వేలి కార్పొరేషన్‌ పరిధిలో మూడు నుంచి నాలుగు అడుగుల దాకా వర్షపునీరు వరదలా ప్రవహిస్తోంది. తెన్‌కాశి, నాగర్‌కోవిల్‌, మదురై, పాపనాశం తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు ఆగిపోయాయి. తిరునల్వేలి జంక్షన్‌ వద్ద ఏడడుగుల లోతున నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరునల్వేలి నగరంలోని పట్టాలపై ఇప్పటికీ ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలను మంగళవారం కూడా నిలిపివేశారు.

తూత్తుకుడిలో పడవలతో రవాణా...

తూత్తుకుడి జిల్లాలో తూత్తుకుడి, శ్రీవైకుంఠం, కాయల్‌పట్టినం, తిరుచెందూరు తదితర ప్రాంతాల్లో 93 సెం.మీల దాకా వర్షం కురవటంతో పల్లపు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రధాన రహదారుల్లో సైతం వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సుమారు నాలుగువేలకు పైగా నివాసగృహాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఆ ఇళ్లలో నివసిస్తున్నవారికి హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. వర్ష బాధితులను 70 పడవల ద్వారా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి డీఎంకే ఎంపీ కనిమొళి కూడా వరద బాధిత ప్రాంతాల్లో నాటు పడవలో వెళ్లి బాధితులకు ఆహార పొట్లాలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

హెలికాప్టర్లతో సహాయక చర్యలు...

కుండపోత వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న తూత్తుకుడి జిల్లాల్లో సైనిక హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. హెలికాప్టర్లలో తూత్తుకుడి, శ్రీవైకుంఠం తదితర ప్రాంతాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న ఇళ్లలో నివసిస్తున్నవారికి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. తూత్తుకుడి నియోజకవర్గ ఎంపీ కనిమొళి(MP Kanimozhi), రాష్ట్ర మంత్రి ఉదయనిధి ఆ జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో మోకాలి లోతు నీటిలో నడిచివెళ్లి బాధితులకు ఆహార పొట్లాలను అందజేశారు. ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకున్నవారికి తన సొంత ఖర్చుతో తయారు చేయించిన అల్పాహారాన్ని అందజేశారు.

nani4.2.jpg

నలుగురి మృతి....

తిరునల్వేలి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు కురిసిన కుండపోత వర్షానికి తామ్రభరణి జలాశయం నుంచి అదనపు జలాలు విడుదల చేయడంతో జననివాస ప్రాంతాల్లో మోకాలి లోతుకు నీరు ప్రవహించింది. ఈ వరదల్లో ముగ్గురి మృతదేహాలు కొట్టుకువచ్చాయి. తిరునల్వేలి జంక్షన్‌ వద్ద వరదనీటిలో 60 యేళ్ల వృద్ధుడి మృతదేహం కొట్టుకువచ్చింది. సీఎన్‌ గ్రామం వద్ద 80 యేళ్ల వృద్ధుడి మృతదేహం నీటిపై తేలియాడింది. పళయపేటకు చెందిన కడర్‌కన్ని (58) వ్యక్తి వరదనీటిలో కొట్టుకుపోయాడు. ఆ మృతదేహం తిరునల్వేలి కార్పొరేషన్‌ పార్కు వద్ద తేలింది. తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం వద్ద సుమారు వెయ్యి కుటుంబాలు జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. శ్రీవైకుంఠం సమీపంలో నివసిస్తున్నవారంతా సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉదయం వరకూ అన్నపానీయాలు లభించక పస్తులతో గడిపారు. తమిళనాడు జవహీత్‌ జమాద్‌ నిర్వాహకులు కూడా రంగంలోకి దిగి జలదిగ్బంధంలో చిక్కుకున్నవారికి ఆహార పదార్థాలను అందిస్తున్నారు.

శిబిరాలకు 11 వేల మంది తరలింపు..

తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి జిల్లాల్లో పల్లపు ప్రాంతాల్లో నివసిస్తున్నవారిని, జలదిగ్బంధంలో చిక్కుకున్నవారిని అగ్నిమాపక, పోలీసు శాఖకు చెందిన సుమారు రెండు వేలమంది సభ్యులు కాపాడి ప్రభుత్వ శిబిరాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి దాకా సుమారు 11 వేలమందిని పడవలు, హెలికాప్టర్లు, అగ్నిమాపక వాహనాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు, ప్రభుత్వ శిబిరాలకు తరలించినట్లు చెప్పారు. తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో 130 సంచార వైద్య బృందాలు రంగంలోకి దిగి వరద బాధితులకు, ప్రత్యేకించి చిన్నారులకు వైద్యసేవలు అందిస్తున్నాయి.

విమానసేవల రద్దు...

తూత్తుకుడి జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ నీరు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ జిల్లాలో రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన యాభై శాతం బస్సులను రద్దు చేశారు. ఇక పట్టాలపై వర్షపునీరు వరదలా ప్రవహిస్తుండడంతో తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో సుమారు 20 రైళ్లను రద్దు చేశారు. ఇదే విధంగా తూత్తుకుడి విమానాశ్రయం వద్ద వర్షపునీరు వరదలా ప్రవహిస్తుండడంతో విమాన సేవలు రద్దయ్యాయి.

నేడు సీఎం పర్యటన...

జలవిలయానికి గురైన తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్నియాకుమారి జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం ఉదయం పర్యటించనున్నారు. మంగళవారం రాత్రి 10 గంటలకు ఢిల్లీలో ఆయన ప్రధాని మోదీతో భేటి అయ్యారు. చెన్నై సహా నాలుగు జిల్లాలు, నాలుగు దక్షిణాది జిల్లాల్లో సంభవించిన వరద పరిస్థితులపై సమగ్రమైన నివేదికను సమర్పించి, ఆ ఎనిమిది జిల్లాల్లో పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బుధవారం వేకువజామున ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.

Updated Date - Dec 20 , 2023 | 08:49 AM