Share News

Governor, CM: అవును.. వారిద్దరూ కలుసుకున్నారు.. గవర్నర్‌తో సీఎం భేటీ.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Dec 31 , 2023 | 08:35 AM

దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచన మేరకు సీఎం స్టాలిన్‌(CM Stalin) శుక్రవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)తో భేటీ అయ్యారు. శాసనసభలో ఆమోదించిన కీలకమైన బిల్లులను, ప్రత్యేకించి పది విశ్వవిద్యాలయాలకు సంబంధించిన

Governor, CM: అవును.. వారిద్దరూ కలుసుకున్నారు.. గవర్నర్‌తో సీఎం భేటీ.. విషయం ఏంటంటే..

- పెండింగ్‌ బిల్లుపై చర్చ

- భేటీ సంతృప్తికరం: రాజ్‌భవన్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచన మేరకు సీఎం స్టాలిన్‌(CM Stalin) శుక్రవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)తో భేటీ అయ్యారు. శాసనసభలో ఆమోదించిన కీలకమైన బిల్లులను, ప్రత్యేకించి పది విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ముసాయిదా చట్ట సవరణ బిల్లులను నెలల తరబడి గవర్నర్‌ పెండింగ్‌లో ఉంచడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ బిల్లులను ఆమోదించడానికి వీలుగా గవర్నర్‌ తగు కాలనిర్ణయం విధించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం శాసనసభలో ప్రతిపాదించిన బిల్లును గవర్నర్‌ ఆమోదించాలని, గవర్నర్‌ పదవి నియామక పదవి అనే విషయాన్ని గుర్తించాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఓ వైపు ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే పది పెండింగ్‌ బిల్లులను గవర్నర్‌ తిప్పిపంపడం, మళ్లీ డీఎంకే ప్రభుత్వం వాటిని రెండోమారు శాసనసభలో ఆమోదించి గవర్నర్‌కు పంపడం చకచకా జ రిగాయి. రెండోమారు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ తిప్పిపంపడానికి వీలులేకపోయింది. ఆ నేపథ్యంలో గవర్నర్‌ రవి ఆపది బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు.అదే సమయంలో ముఖ్యమంత్రి, గవర్నర్‌తో సమావేశమై బిల్లుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని సుప్రీంకోర్టు సూచించింది.ఆ మేరకు గవర్నర్‌ ఈ నెల మొదటి వారంలోనే ముఖ్యమంత్రి స్టాలిన్‌ను తనతో సమావేశమయ్యేందుకు రమ్మంటూ కబురు చేశారు. ఆ సమయంలో ఎనిమిది జిల్లాల్లో తుఫాను, వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతుండటంతో సహాయక చర్యలన్నీ పూర్తయ్యాక కలుసుకుంటానని గవర్నర్‌కు స్టాలిన్‌ తెలియజేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ రవిని కలుసుకున్నారు. స్టాలిన్‌ గవర్నర్‌ సమావేశ మందిరంలో అడుగుపెట్టగానే గవర్నర్‌ రవి నమస్కరిస్తూ ముందుకు వెళ్లి సీఎంతో కరచాలనం చేసి ఆహ్వానించారు. ఆ తర్వాత స్టాలిన్‌ గవర్నర్‌ను పసుపురంగు శాలువతో సత్కరించారు. గవర్నర్‌ పచ్చరంగు శాలువతో స్టాలిన్‌ను సత్కరించారు. స్టాలిన్‌తో పాటు మంత్రులు నీటివనరుల శాఖ మంత్రి దురై మురుగన్‌, ఉన్నతవిద్యాశాఖ మంత్రి రాజకన్నప్పన్‌, న్యాయశాఖ మంత్రి రఘుపతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా కూడా గవర్నర్‌తో సమావేశమయ్యారు. పావుగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఆ తర్వాత గవర్నర్‌ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించాలని కోరుతూ స్టాలిన్‌ వినతి పత్రం అందజేశారు.

nani3.jpg

చర్చలు సంతృప్తికరం: ప్రభుత్వం

ముఖ్యమంత్రి, గవర్నర్‌ మధ్య చర్చలు సంతృప్తికరంగా సాగాయని న్యాయశాఖ మంత్రి రఘుపతి(Minister Raghupati) తెలిపారు. కీలకమైన పది పెండింగ్‌ బిల్లులకు త్వరగా ఆమోదం తెలుపాలని సీఎం విజ్ఞప్తి చేశారని చెప్పారు. ముఖ్యంగా మాజీ మంత్రులు ఎంఆర్‌ విజయభాస్కర్‌, కేసీ వీరమణిపై నమోదైన అక్రమార్జన, అవినీతి కేసులపై విచారణ జరిపేందుకు అనుమతి జారీ చేయాలని రారని చెప్పారు. ముఖ్యమంత్రి, గవర్నర్‌తో భేటీ కావడంపై ప్రభుత్వం ఓ ప్రకటన కూడా జారీ చేసింది. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించాలని, ఈ విషయంలో గవర్నర్‌ రాజ్యాంగ ధర్మాసనానికి కట్టుబడి నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

రాజ్యాంగ ధర్మాసనం ప్రకారమే నడుచుకుంటా: గవర్నర్‌

ముఖ్యమంత్రి స్టాలిన్‌తో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య జరిగిన సమావేశం సంతృప్తికరంగా సాగిందని రాజ్‌భవన్‌ ప్రకటించింది. రాజ్యాంగ ధర్మాసనం ప్రకారమే నడచుకుంటానని, రాష్ట్ర ప్రజల సంక్షేమమే తన ప్రధాన ఆశయమని గవర్నర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలను సామరస్య ధోరణిలో పరిష్కరించేందుకు తామిరువుర మూ పరస్పరం సమావేశంకావడంమంచిదని తెలిపారు.

Updated Date - Dec 31 , 2023 | 08:35 AM