Vande Bharat: దేశవ్యాప్తంగా పెరుగుతున్న వందే భారత్ రైళ్ల సంఖ్య

ABN , First Publish Date - 2023-07-12T17:18:28+05:30 IST

రైల్వేశాఖ మరో నాలుగు వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా తెచ్చిన రైళ్లలో ఢిల్లీ-చండీగఢ్ (243 కి.మీ), చెన్నై-తిరునల్వేలి (622 కి.మీ), గ్వాలియర్- భోపాల్ (432 కి.మీ), లక్నో-ప్రయాగ్‌రాజ్ (200 కి.మీ) ఉన్నాయి.

Vande Bharat: దేశవ్యాప్తంగా పెరుగుతున్న వందే భారత్ రైళ్ల సంఖ్య

దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే భారత్ (Vande Bharat) రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 రైళ్లను భారతీయ రైల్వేశాఖ (Indian Railways) అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో నాలుగు రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Central Government) వెల్లడించింది. దీంతో వందే భారత్ రైళ్ల సంఖ్య 29కి చేరనుంది. జూలై నెలాఖరు నాటికి కొత్త రైళ్లను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

రైల్వే శాఖ కొత్తగా తెచ్చిన రైళ్లలో ఢిల్లీ-చండీగఢ్ (243 కి.మీ), చెన్నై-తిరునల్వేలి (622 కి.మీ), గ్వాలియర్- భోపాల్ (432 కి.మీ), లక్నో-ప్రయాగ్‌రాజ్ (200 కి.మీ) ఉన్నాయి. ఆయా రైళ్లలో ప్రస్తుతానికి 8 కోచ్‌లు మాత్రమే ఉంటాయని.. ఒకవేళ డిమాండ్ ఎక్కువగా ఉంటే 16 కోచ్‌లకు పెంచుతామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఒకవైపు ఛార్జీలు తగ్గించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్న సమయంలో రైల్వేశాఖ ఒకేసారి నాలుగు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: Train Fighting: ఎన్నోసార్లు రైలు ప్రయాణాలు చేసి ఉంటారు కానీ.. ఇలాంటి సీన్ మాత్రం అస్సలు చూసి ఉండరు..!

మరోవైపు ఏప్రిల్ 1 నుంచి జూన్ 29 మధ్య నడిచే వందే భారత్ రైళ్ల అధికారిక ఆక్యుపెన్సీ డేటా ప్రకారం 46 మార్గాలలో 60 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్న రైళ్లు ఏడు ఉన్నాయి. దీంతో ఆయా రైళ్లను అధికారులు రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుతూ అందౌరా నుంచి న్యూఢిల్లీ వరకు నడిచే వందే భారత్ రైలుకు వెయ్యి మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. కానీ 16 కోచ్‌లతో నడిచే ఈ రైలు సగటు ఆక్యుపెన్సీ 61 శాతం మాత్రమేనని అధికారులు చెప్తున్నారు.

అలాగే గోవా-ముంబై మధ్య నడుస్తున్న వందేభారత్ ఆక్యుపెన్సీ కూడా 55 శాతం మాత్రమే. కొన్ని సందర్భాల్లో కాలానికి అనుగుణంగా రైళ్లలో ఆక్యుపెన్సీ మారుతుంటుందని.. వర్షాకాలంలో గోవా వెళ్లేందుకు పర్యాటకులు ఇష్టపడరు కాబట్టి ఈ సమయంలో గోవా-ముంబై వందే భారత్ రైలులో ఆక్యుపెన్సీ మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇండోర్- భోపాల్ మధ్య తిరుగు ప్రయాణంలో వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ వరుసగా 29 శాతం కంటే తక్కువగా ఉంటుందని.. అయితే రానున్న రోజుల్లో డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అటు భోపాల్-జబల్‌పూర్ మధ్య కూడా ఆక్యుపెన్సీ 40 శాతం కంటే తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఆక్యుపెన్సీ తక్కువ ఉన్న మార్గాల్లో ఛార్జీలను తగ్గే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-07-12T17:18:28+05:30 IST