Former Chief Minister: బీడీఏ లంచం కేసులో.. మాజీసీఎంకు మళ్లీ షాక్‌

ABN , First Publish Date - 2023-10-12T10:44:34+05:30 IST

బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) హౌసింగ్‌ పథకం పనులు కాంట్రాక్టు ఇచ్చేందుకు లంచం తీసుకున్నారనే కేసులో మాజీ ముఖ్యమంత్రి

Former Chief Minister: బీడీఏ లంచం కేసులో.. మాజీసీఎంకు మళ్లీ షాక్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) హౌసింగ్‌ పథకం పనులు కాంట్రాక్టు ఇచ్చేందుకు లంచం తీసుకున్నారనే కేసులో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Former Chief Minister Yeddyurappa)కు మళ్ళీ షాక్‌ తగిలింది. యడియూరప్పపై ఎఫ్‌ఐఆర్‌ నిరాకరణకు కోరిన విషయమై పునఃపరిశీలిస్తామని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. మంగళవారం సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం ముందు కర్ణాటక అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ అమన్‌ పన్వార్‌ వివరించారు. యడియూరప్ప తరుపున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ సిద్దార్థ లూథ్రా ఇది కేవలం రాజకీయ కుట్రగా లేదని అంతకు మించి వేధించేలా ఉందని వాదించారు. మూడు వారాల తర్వాత విషయాన్ని పరిగణిస్తామని ధర్మాసనం తెలిపింది. సామాజిక కార్యకర్త టీజే అబ్రహం దాఖలు చేసిన పిటీషన్‌ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని విచారణకు నిర్ధిష్టమైన తేదీలు ఇవ్వాలని ఆయన తరుపు న్యాయవాదులు కోరారు. బెంగళూరు తూర్పు తాలూకా కోనదాసనపురలో బీడీఏ నిర్మిస్తున్న బహళ అంతస్తుల వసతి నిర్మాణాల పనులు అప్పగించేందుకు చంద్రకాంత్‌ రామలింగం నుంచి రూ.29.5 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. అందుకు అనుగుణంగానే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి విచారణలు జరపాలని కోర్టు ఆదేశించింది. అయితే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసేందుకు ముందు అనుమతి పొందడం తప్పనిసరి అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదని యడియూరప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో యడియూరప్పతో పాటు అల్లుడు విరూపాక్షప్ప యమకనమరడి, అతడి కుమారుడు శశిధర్‌ యమకనమరడి, విరూపాక్షప్ప అల్లుడు సంజయ్‌శ్రీ, కాంట్రాక్టర్‌ చంద్రకాంత్‌ రామలింగ, ఐఏఎస్‌ అధికారి జేసీ ప్రకాష్‌, 37 క్రీసెంట్‌ హోటల్స్‌ యజమాని కే రవిలు ఉన్నారు.

Updated Date - 2023-10-12T10:44:34+05:30 IST