Share News

Dussehra festival: సొంతూళ్లకు 5 లక్షల మంది పయనం..

ABN , First Publish Date - 2023-10-22T11:17:38+05:30 IST

దసరా పండుగ(Dussehra festival)ను పురస్కరించుకుని చెన్నైలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసున్న రాష్ట్రవాసులు తమ సొంతూళ్ల్లకు బయలుదేరారు.

Dussehra festival: సొంతూళ్లకు 5 లక్షల మంది పయనం..

- కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

- టోల్‌ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు

అడయార్‌(చెన్నై): దసరా పండుగ(Dussehra festival)ను పురస్కరించుకుని చెన్నైలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసున్న రాష్ట్రవాసులు తమ సొంతూళ్ల్లకు బయలుదేరారు. వారాంతపు సెలవులతో పాటు దసరా పండుగ సెలవు రోజు కలిసి రావడంతో సొంతూర్లకు పయనమైనారు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఏకంగా 5 లక్షల మంది నగరం నుంచి తమ ఊర్లకు వెళ్లారు. దీంతో టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటరు మేరకు బారులు తీరాయి. అంతేకాకుండా, బస్సులు, ప్రైవేటు బస్సులు, రైళ్ళలో విపరీతమైన రద్దీ నెలకొంది.

ఉదయం నుంచే... : దసరా సెలవులను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం నుంచే కోయంబేడు, పూందమల్లి, తాంబరం మెప్స్‌, మాధవరం బస్టాండ్లలో తమ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ కనిపించింది. ముఖ్యంగా ఈ రద్దీని నివారించేందుకు వీలుగా చెన్నై నుంచి వివిధ దూర ప్రాంతాలకు 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర రవాణా శాఖ ఏకంగా 2,765 ప్రత్యేక బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంది. అంటే, మామూలుగా నడిపే 2,100 బస్సులతో పాటు అదనంగా మరో 651 సర్వీసులను నడిపింది. అదేవిధంగా కోయంబత్తూరు, మదురై, తిరుప్పూరు, బెంగళూరు, తిరునెల్వేలి, తిరుచ్చి, సేలం, కన్నియాకుమారి తదితర ప్రాంతాల నుంచి కూడా ఇతర ఊర్లకు ఈ ప్రత్యేక బస్సులను నడిపారు. అయితే, ఒక్క చెన్నై నగరం నుంచి 1,51,305 మంది ప్రయాణించినట్టు రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా శనివారం కూడా రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అదనంగా 950 బస్సులను నడిపారు. ఈ బస్సుల్లో శనివారం మధ్యహ్నం వరకు 40 వేల మంది ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్నారు. అలాగే, ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన బస్సుల్లో మాత్రమే కాకుండా, ప్రైవేటు బస్సులు, రైళ్ళలో కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. దూరప్రాంతాలకు వెళ్లే రైళ్ళలో ముందస్తు రిజర్వేషన్‌ రెండు మూడు నెలల క్రితమే నిండిపోయింది. దీంతో జనరల్‌ బోగీలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఈ జనరల్‌ బోగీల్లో కూడా కాలు పెట్టడానికి వీలులేని ప్రయాణికులు ఎప్పటిలానే ప్రైవేటు బస్సుల్లో అధిక చార్జీలు చెల్లించి తమ ఊర్లకు బయలుదేరి వెళ్లారు. చెన్నై నగరం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు దాదాపు 1200 నుంచి 1500కు పైగా ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బస్సుల్లో ఎప్పటిలాగానే వారాంతపు, వరుస సెలవుల్లో వసూలు చేసే విధంగా అధిక చార్జీలను వసూలు చేశారు.

Updated Date - 2023-10-22T11:17:38+05:30 IST