Share News

Dussehra: కిటకిటలాడుతున్న బస్సులు, రైల్వేస్టేషన్లు

ABN , First Publish Date - 2023-10-21T10:42:21+05:30 IST

దసరా(Dussehra) వరుస సెలవుల్లో స్వస్థలాల్లో ఆ పండుగను జరుపుకునేందుకు చెన్నై నుంచి శుక్రవారం సాయంత్రం సుమారు లక్ష మంది

Dussehra: కిటకిటలాడుతున్న బస్సులు, రైల్వేస్టేషన్లు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దసరా(Dussehra) వరుస సెలవుల్లో స్వస్థలాల్లో ఆ పండుగను జరుపుకునేందుకు చెన్నై నుంచి శుక్రవారం సాయంత్రం సుమారు లక్ష మంది రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు, ప్రత్యేక బస్సులు, ఆమ్నీ బస్సుల్లో బయలుదేరారు. ఈ బస్సుల్లో టిక్కెట్ల రిజర్వేషన్‌ రెండు రోజులకు ముందే పూర్తయ్యింది. దీంతో అప్పటికప్పుడు స్వస్థలాలకు బయలు దేరే వారితో కోయంబేడు, పెరుంగళత్తూరు, మాధవరం, అంబత్తూరు బస్టాండ్లు కిటకిటలాడగా, బస్సులు దొరక్క ఇబ్బంది పడ్డారు. చేసేది లేక రైళ్లలో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఎగ్మూరు, సెంట్రల్‌ స్టేషన్‌లలో వేలసంఖ్యలో ప్రయాణికులు గుమికూడారు. అన్‌రిజర్వుడు బోగీల్లో ఎక్కేందుకు పడరాని పాట్లు పడ్డారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ రైల్వే దక్షిణాది జిల్లాల్లోని ప్రధాన నగరాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లలోనూ ముందుగానే టిక్కెట్ల రిజర్వేషన్‌ పూర్తయ్యింది. దీంతో ప్రత్యేక రైళ్లలో అప్పటికప్పుడు ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర రవాణా సంస్థ చెన్నై నుంచి వివిధ నగరాలకు రోజూ నడుపుతున్న 2100 బస్సులకు అదనంగా 1000 దసరా స్పెషల్‌ బస్సులను నడుపుతోంది ఈ ప్రత్యేక బస్సులన్నీ కోయంబేడు, తాంబరం మెప్స్‌, మదురవాయల్‌ బైపాస్‌ ప్రాంతాల నుంచి నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై(Chennai) నుంచి పగటిపూట వెళ్లే గురువాయూరు, చోళన్‌, పుదుచ్చేరి, వైగై, పల్లవన్‌, తేజస్‌, వందేభారత్‌ తదితర రైళ్లలోనూ రద్దీ అధికమైంది. ఇదే విధంగా సాయంత్రం బయలుదేరిన కన్నియాకుమారి, తిరుచెందూరు, రామేశ్వరం, తూత్తుకుడి, తిరువనంతపురం, సెంగోటై, కొల్లం రైళ్లలో అన్నీ బోగీలు జనంతో నిండిపోయాయి. ఈ రైళ్లలో అన్‌రిజర్వుడు బోగీల్లో సీట్ల కోసం ప్రయాణికులు మూడు గంటలపాటు రైల్వేస్టేషన్లలో వేచి ఉండాల్సి వచ్చింది.

Updated Date - 2023-10-21T10:42:21+05:30 IST