Share News

MK Stalin గవర్నర్‌ను తొలగించొద్దు.. కేంద్రాన్ని కోరిన ఎంకే స్టాలిన్.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-10-28T09:01:42+05:30 IST

రానున్న లోక్ సభ ఎన్నికల(Lokhsabha Elections) వరకు గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)ని తొలగించవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amith Shah)లను కోరారు. ఆయన మాట్లాడుతూ.. ద్రవిడంపై గవర్నర్ చేసిన విమర్శలు డీఎంకే ఎన్నికల ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయని అన్నారు.

MK Stalin గవర్నర్‌ను తొలగించొద్దు.. కేంద్రాన్ని కోరిన ఎంకే స్టాలిన్.. ఎందుకంటే?

చెన్నై: రానున్న లోక్ సభ ఎన్నికల(Lokhsabha Elections) వరకు గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)ని తొలగించవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amith Shah)లను కోరారు. ఆయన మాట్లాడుతూ.. ద్రవిడంపై గవర్నర్ చేసిన విమర్శలు డీఎంకే ఎన్నికల ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయని అన్నారు. బుధవారం రాజ్‌భవన్‌ ఎదుట పెట్రోల్‌ బాంబు దాడికి డీఎంకే కారణమంటూ గవర్నర్‌ ఆరోపించడంపై స్టాలిన్ స్పందించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే వివిధ పాలనాపరమైన అంశాలు, సైద్ధాంతిక విభేదాలతో గవర్నర్ రవి, అధికార డీఎంకే(DMK) మధ్య తరచూ వాగ్వాదం జరుగుతోంది. 'గవర్నర్ ఆర్ఎన్ రవిని 2024 లోక్‌సభ ఎన్నికల వరకు ఇక్కడే కొనసాగించండి. ఆయన మా పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఇది పరోక్షంగా మాకు మద్దతునిస్తోంది. గవర్నర్ ప్రకటనలను పబ్లిక్ సీరియస్‌గా తీసుకోవడం లేదు' అని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టాలిన్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వర్కింగ్ ఏజెంట్‌ అని డీఎంకే విమర్శిస్తోంది. బీజేపీకి గవర్నర్లు తొత్తుల్లా మారారని ఆ పార్టీ ప్రధాన వాదన. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతున్న పలు బిల్లుల్ని గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టడం ఏంటని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. దీంతో గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వచ్చాయి. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో పెత్తనం చెలాయించడానికి గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుంటోందని దేశంలోని చాలా అధికార పార్టీలు విమర్శిస్తున్నాయి.


భద్రతాలోపం లేదు..

తమిళనాడు పోలీసు డైరెక్టర్ జనరల్ శంకర్ జివాల్, గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ రాజ్‌భవన్‌పై దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. బుధవారం పెట్రోల్ బాంబు సంఘటన గురించి వివరిస్తూ రాజ్ భవన్‌కు భద్రతా లోపం లేదని తెలిపారు. బాంబు దాడి నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మరింత లోతుగా విచారించిన తరువాత అసలు విషయాలు బయటపడతాయన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 73 మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్లు జివాల్ తెలిపారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Updated Date - 2023-10-28T09:02:20+05:30 IST