Salary hike: 66 శాతం పెరిగిన ఎమ్మెల్యేల వేతనం

ABN , First Publish Date - 2023-03-13T20:09:37+05:30 IST

ఎమ్మెల్యేలకు అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. ఎమ్మెల్యేల వేతనాలను 65 శాతం పెంచుతూ..

Salary hike: 66 శాతం పెరిగిన ఎమ్మెల్యేల వేతనం

న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలకు (MLAs) అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. ఎమ్మెల్యేల వేతనాలను 65 శాతం పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీ ఎమ్మెల్యేలకు వేతనం, అలవెన్స్ పెంచుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

పెరిగిన వేతనాల ప్రకారం, ప్రస్తుతం రూ.54,000 నెలవారీ వేతనం పొందుతున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు రూ.90,000 అందుకుంటారు. వారి నెలవారీ మూల వేతనం రూ.12,000 నుంచి 30,000కు పెరుగుతుంది. కన్వేయన్స్ అలవెన్సు రూ.6,000 నుంచి రూ.10,000కు పెరుగుతుంది. టెలిఫోన్ అలవెన్స్ రూ.8,000 నుంచి రూ.10,000కు చేరుతుంది. సెక్రటేరియట్ అలవెన్స్ రూ.10,000 నుచి రూ.15,000 అవుతుంది.

మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, శాసనసభలో ప్రతిపక్ష నేత నెలసరి వేతనం రూ.72,000 నుంచి 1.70 లక్షకు చేరుతుంది. వారి నెలవారీ మూల వేతనం రూ.20,000 నుంచి రూ.60,000కు పెరుగుతుంది. అలాగే, నియోజకవర్గం అలవెన్సులు రూ.18,000 నుంచి రూ.30,000కు పెరుగుతోంది. డెయిలీ అలవెన్స్ రూ.1000 నుంచి 1,500కు, పెరుగుతుంది. సెక్రటేరియట్ అసిస్టెన్స్‌గా రూ.25,000 పొందుతారు. వీటికితోడు, కుటుంబంతో సహా చేసే వార్షిక ట్రావెల్ రీఇంబర్స్‌మెంట్ ప్రస్తుతం ఉన్న రూ.50,000 నుంచి లక్ష రూపాయలకు పెరగనుంది. రూ.20,000 వరకూ రెంట్ ఫ్రీ అకామిడేషన్, కారు-డ్రైవర్‌ను ఉచితంగా వాడుకోవడం కానీ, రూ.10,000 నెలవారీ కన్వేయన్స్ అలవెన్స్ కానీ అందుకోవచ్చు. వైద్య చికిత్స ఉచితం.

ఢిల్లీ ఎమ్మెల్యేలు దేశంలోనే అతి తక్కువ వేతనాలు అందుకుంటుండటంపై గత ఏడాది జూలైలో ఢిల్లీ అసెంబ్లీలో చర్చ జరగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్ విప్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విపక్ష నేత వేతనాలను పెంచుతూ సభలో ఐదు బిల్లులను ప్రవేశపెట్టారు. సభ్యులు వీటిని ఆమోదించడంతో రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. రాష్ట్రపతి సైతం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో ఈనెల 9న న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

Updated Date - 2023-03-13T20:09:37+05:30 IST