Manish Sisodia: బెయిలు నో.. భార్యను కలుసునేందుకు ఓకే..!

ABN , First Publish Date - 2023-06-05T16:27:20+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆరు వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. అయితే, అస్వస్థతతో చికిత్స పొందుతున్న భార్యను కలుసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Manish Sisodia: బెయిలు నో.. భార్యను కలుసునేందుకు ఓకే..!

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise Policy) కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)కు మరోసారి నిరాశ ఎదురైంది. ఆరు వారాల పాటు తాత్కాలిక బెయిల్ (Interm Bail) మంజూరు చేయాలని కోరుతూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సోమవారంనాడు తోసిపుచ్చింది. అయితే, అస్వస్థతతో చికిత్స పొందుతున్న భార్యను కలుసుకునేందుకు ఆయనకు మరోసారి అనుమతి ఇచ్చింది.

సిసిడియాను ఆయన నివాసానికి కాని, ఆసుపత్రికి కానీ ఏదైనా ఒక రోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల లోపు తీసుకువెళ్లాలని జైలు అధికారులను జస్టిస్ దినేష్ కుమార్ శర్మ అదేశించారు. ఆయన తన భార్యను, కుటుంబ సభ్యులను మాత్రమే కలుసుకోవాలని, ఇతరులను కలుసుకోవడం, మీడియాతో మాట్లాడటం చేయరాదని స్పష్టం చేశారు. సిసోడియా తన ఇంటికి కానీ, ఆసుపత్రికి కానీ వెళ్లేటప్పుడు మీడియా గుమిగూడకుండా చూడాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. మొబైల్ ఫోన్ కానీ, ఇంటర్నెట్ కానీ ఆయన ఉపయోగించరాదని కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. అస్వస్థతతో ఉన్న భార్యను కలుసుకునేందుకు సిసోడియాను కోర్టు అనుమతించడం ఇది రెండోసారి.

మిసెస్ సిసోడియాకు మెరుగైన వైద్యం...

సిసిడియా భార్యకు మెరుగైన చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. ఎక్కడ చికిత్స తీసుకోవాలో నిర్ణయించుకునే హక్కు పేషెంట్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు ఉందని, అయితే ఎయిమ్స్‌ ఏర్పాటు చేసే బోర్డ్ ఆఫ్ డాక్టర్స్ పర్యవేక్షణలో ఆమె చికిత్స తీసుకోవడం మంచిదని సూచించింది. కాగా, సిసోడియాపై ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా ఆయన కోరిన ఆరు వారాల బెయిల్‌ను నిరాకరిస్తున్నట్టు స్పష్టం చేసింది.

Updated Date - 2023-06-05T16:27:20+05:30 IST