Covid positive: మళ్లీ పెరుగుతున్న ‘కరోనా’ పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2023-03-07T11:42:11+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్‌ ప్రబలుతున్న ప్రాంతాల్లో కొవిడ్‌ పరీక్షలు పెంచాలని ఆరోగ్యశాఖ(Department

Covid positive: మళ్లీ పెరుగుతున్న ‘కరోనా’ పాజిటివ్ కేసులు

- పరీక్షలు పెంచాలంటూ ప్రభుత్వ ఉత్తర్వులు

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్‌ ప్రబలుతున్న ప్రాంతాల్లో కొవిడ్‌ పరీక్షలు పెంచాలని ఆరోగ్యశాఖ(Department of Health) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. ఒకటిన్నర నెలలుగా కరోనా కేసులు 10 లోపు మాత్రమే నమోదవు తుండగా, మూడు నెలలుగా మృతులు లేవు. అదే సమయంలో చైనా(China)లో తాజాగా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందిన కొత్త కరోనా వైరస్‌ రాష్ట్రంలో ప్రవేశించ కుండా ఆరోగ్యశాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది. చైనా సహా ఐదు దేశాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేయడంతో పాటు, లక్షణాలున్న వారిని హోం క్వారంటైన్‌కు పంపిం చారు. కొత్త కరోనా వైరస్‌ ప్రభావం రాష్ట్రంలో లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 28కి పెరిగింది. వారిలో చెన్నై, చెంగల్పట్టు(Chennai, Chengalpattu) జిల్లాల్లో తలా నలుగురు, కోవై, కృష్ణగిరి, సేలం జిల్లాల్లో తలా ముగ్గురు, సింగపూర్‌, బెహరన్‌, యూఏఈ నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 146 మంది కరోనా లక్షణాలతో చికిత్సలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొవిడ్‌ టెస్టులు పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3 వేల నుంచి 3500 వరకు నిర్వహిస్తున్న కరోనా పరీక్షలను 4 వేల నుంచి 5 వేలకు పెంచాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా నిబంధనలతో ‘హెచ్‌3ఎన్‌2’ దూరం

కరోనా నిబంధనలు పాటిస్తే ‘హెచ్‌3ఎన్‌2’ వైరస్‌ దరిచేరదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తెలిపారు. చెంగల్పట్టులో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో హెచ్‌3ఎన్‌2’ రకం వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందన్నారు. ఈ వైరస్‌లో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, నాలుగు రోజుల్లో ఆరోగ్యవంతులవుతారని, ఈ వైరస్‌ వల్ల మృతి చెందే అవకాశం లేదన్నారు. మాస్క్‌ ధారణ, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం తదితరాలు పాటించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-03-07T11:42:11+05:30 IST