AK Antony: తన కుమారుడు బీజేపీలో చేరడంపై ఏకే ఆంటొనీ రియాక్షన్

ABN , First Publish Date - 2023-04-06T18:23:42+05:30 IST

తన కుమారుడు అనిల్ కె ఆంటొనీ (Anil Antony) బీజేపీలో(Bharatiya Janata Party) చేరడంపై మాజీ రక్షణమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటొనీ(AK Antony) స్పందించారు.

AK Antony: తన కుమారుడు బీజేపీలో చేరడంపై ఏకే ఆంటొనీ రియాక్షన్
AK Antony

న్యూఢిల్లీ: తన కుమారుడు అనిల్ కె ఆంటొనీ (Anil Antony) బీజేపీలో(Bharatiya Janata Party) చేరడంపై మాజీ రక్షణమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటొనీ(AK Antony) స్పందించారు. తన కుమారుడిది తప్పుడు నిర్ణయమని, తనకు చాలా బాధగా ఉందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) సిద్ధాంతాన్ని, బీజేపీ సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని ఏకే ఆంటొనీ చెప్పారు. తన జీవితకాలమంతా మతతత్వ అజెండాను వ్యతిరేకించానని చెప్పారు. తాను ఎప్పటికీ నెహ్రూ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి విధేయుడనని తెలిపారు. తాను తన రాజకీయ చరమాంకంలో ఉన్నానని, తాను ఎంతకాలం బతికి ఉంటానో తెలియదని, అయితే బతికినంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు.

అంతకు ముందు అనిల్ కె ఆంటొనీ (Anil Antony) బీజేపీలో(Bharatiya Janata Party) చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, మురళీధరన్, తదితరుల సమక్షంలో ఆయన కమలం పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. కేంద్ర మంత్రులు అనిల్ కె ఆంటొనీకి బీజేపీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత మురళీధరన్, అనిల్ ఆంటొనీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. తన తండ్రి అంటే తనకు ఎంతో గౌరవమని, బీజేపీలో చేరడం తన సొంత నిర్ణయమని అనిల్ ఆంటొనీ చెప్పారు.

అనిల్ కే ఆంటొనీ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి, కేరళ కాంగ్రెస్ డిజిటల్ కమ్యూనికేషన్స్, సోషల్ మీడియా విభాగాధిపతి(KPCC Digital Media, Digital Communications Cell) పదవులకు రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)పై బీబీసీ (BBC) ప్రసారం చేసిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ డాక్యుమెంటరీ (BBC documentary)ని అనిల్ కే ఆంటొనీ ఇటీవలే తీవ్రంగా విమర్శించారు.

భారత్‌లో అంతర్గతంగా భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నా... విదేశీ మీడియా కలుగజేసుకుని విభేదాలు సృష్టించేందుకు అవకాశం కల్పించరాదని అనిల్ కె ఆంటొనీ ఇటీవలే అభిప్రాయపడ్డారు. 20 ఏళ్ల క్రితం జరిగినదానిపై ఇప్పుడు రగడ ఎందుకని ఆయన ప్రశ్నించారు. భారత్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఉందని చెప్పారు.

ప్రస్తుతం కేరళలో బీజేపీకి యువ నాయకత్వం కొరత ఉంది. కేరళలో ఆర్ఎస్ఎస్ బలంగా ఉన్నా బీజేపీకి సరైన నాయకత్వం లేదు. అనిల్ రాకతో కేరళలో బీజేపీకి బలం చేకూరినట్లేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. క్రిష్టియన్ల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో అనిల్ కె ఆంటొనీ రాక కమలనాథులకు మేలు చేయవచ్చంటున్నారు.

బీబీసీ (BBC) ఇటీవలే మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. కేంద్రం బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్‌లో బ్లాక్‌ చేయాలంటూ యూట్యూబ్‌, ట్విటర్‌లను ఆదేశించింది. బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని, విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి చొప్పించాలనే లక్ష్యంతో రూపొందించిన, తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది.

AAP: కాంగ్రెస్‌కు షాకిచ్చి ఆప్‌లో చేరిన 24 గంటల్లోనే..

Farooq Abdullah: స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన టీ పార్టీలో ఏం జరిగిందంటే?



Updated Date - 2023-04-06T18:28:36+05:30 IST