Jairam Ramesh: 45 రోజులుగా ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నట్టు?

ABN , First Publish Date - 2023-03-19T14:28:22+05:30 IST

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ప్రస్తావించిన లైంగిక వేధింపుల బాధితుల వివరాలు ఇవ్వాలంటూ..

Jairam Ramesh: 45 రోజులుగా ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నట్టు?

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించిన లైంగిక వేధింపుల బాధితుల వివరాలు ఇవ్వాలంటూ ఆయన నివాసానికి వెళ్లిన ఢిల్లీ పోలీసులను కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) తప్పుపట్టారు. భారత్ జోడో యాత్ర ముగిసిన 45 రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు రాహుల్ ఇంటికి వెళ్లడాన్ని ఆయన నిలదీశారు. ఢిల్లీ పోలీసుల నోటీసుకు రాహుల్ న్యాయవాదుల టీమ్ చట్టప్రకారం స్పందిస్తుందని చెప్పారు.

ఢిల్లీ పోలీసుల చర్యపై ఆదివారంనాడిక్కడ మీడియాతో జైరామ్ రమేష్ మాట్లాడుతూ...''భారత్ జోడో యాత్ర ముగిసి కూడా 45 రోజులైంది. అత్యాచార బాధితుల విషయంలో నిజంగానే పోలీసులకు అంత ఆందోళనే ఉంటే ఫిబ్రవరిలోనే రాహుల్ వద్దకు ఎందుకు వెళ్లలేదు? రాహుల్ లీగల్ టీమ్ చట్టప్రకారం తగురీతిలో స్పందిస్తుంది'' అని అన్నారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) వెయ్యాలని టీఎంసీ మినహా 16 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయని, దాంతో అకస్మాత్తుగా రాహుల్ గాంధీ లండన్‌లో మాట్లాడిన అంశాలను వాళ్లు (బీజేపీ) లేవనెత్తారని జైరామ్ రమేష్ తెలిపారు. జేపీసీ డిమాండ్ అంశాన్ని పక్కదారి పట్టిచేందుకే రాహుల్ గాంధీ మాటలను వక్రీకరించి, ఆయనను అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ యత్నించిందని దుయ్యపట్టారు. తమ ప్రసంగాలను రికార్డుల నుంచి తొలగించారని, ఈరోజు అమృత్ కాల్ కాదని, ఆప్తకాల్ (ఎమర్జెన్సీ) అని ఆయన అన్నారు. ఇది కచ్చితంగా నియంతృత్వమేనని చెప్పారు. పార్లమెంటును సజావుగా నడిపించే బాధ్యత ప్రభుత్వానిదేనని, తాము సహకరిస్తున్నప్పటికీ తమను పార్లమెంటులో మాట్లాడనీయకుండా చేస్తున్నారని, సభ సజావుగా సాగనీయకుండా చేయడమే ప్రభుత్వం ఉద్దేశమనేది చాలా స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

హైడ్రామా...

రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు ఆదివారంనాడు చేరుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. భారత్ జోడో యాత్రలో ప్రస్తావించిన లైంగిక వేధింపుల బాధితుల వివరాలు ఇవ్వాలని కోరేందుకే రాహుల్ నివాసానికి వెళ్లినట్టు పోలీసు నాయకత్వం వహించిన ఢిల్లీ పోలీసు శాంతిభద్రతల విభాగం ప్రత్యేక పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. లైంగిక వేధింపుల గురించి ఆయనను ఎవరు ఆశ్రయించారో తెలియజేయాలని రాహుల్‌కు ముందుగా నోటీసు ఇచ్చామని అన్నారు. రాహుల్ గాంధీ అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాలో పెట్టిన పోస్ట్‌ల ఆధారంగా ఈ కేసును నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

కాగా, రాహుల్ గాంధీ జనవరి 30న శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ, మన దేశంలో మహిళలపై దాడులు ఇప్పటికీ జరుగుతున్నాయన్నారు. దీని గురించి మీడియా మాట్లాడటం లేదన్నారు. తన పాదయాత్రలో తనను ఇద్దరు మహిళలు కలిశారని చెప్పారు. తమపై సామూహిక అత్యాచారం జరిగిందని వారు తనకు చెప్పారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని తాను వారికి చెప్పానని, ఫిర్యాదు చేస్తే తమకు పెళ్లిళ్లు కావనే ఉద్దేశంతో, ఫిర్యాదు చేసేందుకు వారు తిరస్కరించారని తెలిపారు. ఈ మాటలను ఢిల్లీ పోలీసులు విచారణకు చేపట్టారు. బాధితుల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని కోరారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు.

Updated Date - 2023-03-19T14:28:22+05:30 IST