Share News

Chief Minister: జనవరి నుంచి ఐదో గ్యారెంటీ యువనిధి అమలు

ABN , First Publish Date - 2023-11-28T11:53:22+05:30 IST

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు గ్యారెంటీ పథకాలను అత్యంత విజయవంతంగా అమలు చేస్తోందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)

Chief Minister: జనవరి నుంచి ఐదో గ్యారెంటీ యువనిధి అమలు

- ముఖ్యమంత్రి సిద్దరామయ్య

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు గ్యారెంటీ పథకాలను అత్యంత విజయవంతంగా అమలు చేస్తోందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు. తన అధికార నివాసం కృష్ణలో జనస్పందన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యారెంటీ పథకాలకు సంబంధించి ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వీరికి పేదల సంక్షేమం పట్టదని చురకలంటించారు. ఐదో గ్యారెంటీ యువనిధిని 2024 జనవరిలో లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. 2022-23 అవధిలో డిగ్రీ పూర్తి చేసిన యువతకు రెండేళ్లపాటు నెలకు రూ.3వేలు, డిప్లమో పూర్తి చేసుకున్న యువతకు నెలకు రూ.1500 ఇస్తామని పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఇంతవరకు 1.17 కోట్ల మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వీరిలో 1.14 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని, డిసెంబరు చివరినాటికి మిగిలినవారికి కూడా ఈ పథకం అందుతుందని తెలిపారు. సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని వివరించారు. అన్నభాగ్య పథకం ద్వారా 4.34 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక ఇంతవరకు తాను ఆరు నెలల్లో సీఎం సహాయనిధి నుంచి రూ.25కోట్లను వైద్య చికిత్సల కోసం నిరుపేదలకు విడుదల చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.4లక్షల కోట్ల వరకు కేంద్రానికి పన్నులరూపంలో చెల్లిస్తూ ఉంటే ప్రకృతి వైపరీత్యాలు, కరువు సమయాల్లో రూ.50-60వేల కోట్ల వరకు మాత్రమే విడుదల చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఇంతవరకు కేంద్రం నుంచి కరువు సాయం ఒక్కపైసా విడుదల కాలేదని, ఈ జాప్యానికి కారణం ఏమిటో తెలియడం లేదని సీఎం వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-11-28T11:53:24+05:30 IST