Union Budget 2023: ఏమాత్రం కనికరం లేని బడ్జెట్: చిదంబరం

ABN , First Publish Date - 2023-02-01T20:19:34+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత విమర్శలు...

Union Budget 2023: ఏమాత్రం కనికరం లేని బడ్జెట్: చిదంబరం

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (Union Budget 2023)పై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత విమర్శలు గుప్పించారు. ప్రజలు, వారి ఆందోళనలను ఏమాత్రం మోదీ పట్టించుకోలేదని, ఎంతమాత్రం కనికరం లేని బడ్జెట్ ఇదని అన్నారు. మెజారిటీ ప్రజల ఆశలను చిదిమేశారని ఆక్షేపించారు. ప్రజల జీవితాలు, జీవనోపాధి, అసమానతలు పెరగడం వంటి ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. బుధవారంనాడిక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం మాట్లాడుతూ, నిరుద్యోగం, పేదరికం, అసమానతలు, సమత్వం వంటి మాటలు నిర్మలా సీతారమన్ బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కడా కనిపించలేదన్నారు. కేవలం రెండుసార్లే పేదలు అనే పదం వాడారని, దీనిని బట్టే ప్రభుత్వానికి ఎవరంటే పట్టింపు ఉందో, ఎవరిపట్ల పట్టింపు లేదో అవగాహన అవగాహన అవుతుందని అన్నారు.

బడ్జెట్‌లో పన్నుల ఉపశమనం కూడా తగినంతగా లేదని చిదంబరం అన్నారు. కొత్త పన్నుల విధానం ఎంచుకునే వారిని ఉద్దేశించే ఈ టాక్స్ రిలాక్సేషన్ ప్రకటించారని అన్నారు. కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకోవడం 'డిఫాల్డ్ ఆప్షన్ ' గా చిదంబరం పేర్కొన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)పై మాట్లాడుతూ, పరోక్ష పన్నులేవీ తగ్గించలేదని, క్రూరమైన, అహేతకమైన జీఎస్‌టీ రేట్లలో ఎలాంటి కోత లేదని అన్నారు. కీలకమైన ఇంధనం, ఎరువులు, ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి అంశాల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదన్నారు. పెట్రోల్, డీజిల్, సిమెంట్, ఎరువులు తదితరాల ధరలు తగ్గించలేదని, ఇబ్బడిముబ్బడి సర్‌చార్జీలు, సెస్‌లలో కోత లేదని, రాష్ట్ర ప్రభుత్వాలతో వీటిపై సంప్రదించినట్టు కూడా కనిపించలేదని అన్నారు. నిరుద్యోగ యువత, హోమ్‌మేకర్లు, పన్ను చెల్లింపుదారులకు వార్షిక బడ్జెట్‌లో ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని చెప్పారు.

దేశంలో ఆదాయ అసమానతలపై మాట్లాడుతూ, పేద, ధనిక అసమానతలు పెరుగుతున్నాయనే ప్రజల ఆందోళన చెందుతున్నారని, దేశ జనాభాలోని 1 శాతం మంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతమైందనే ప్రజల ఆందోళనను బడ్జెట్ ఖాతరు చేయలేదని చిదంబరం అన్నారు. ఆర్థిక రాజధానులు, ఇతర సిటీలను పట్టించుకోకుండా గిఫ్ట్ సిటీ అహ్మదాబాద్‌‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు

Updated Date - 2023-02-01T20:23:44+05:30 IST