Governor Vs CM Baghel : రిజర్వేషన్ బిల్లుపై ఛత్తీస్‌గఢ్ గవర్నర్, సీఎం మధ్య రచ్చ

ABN , First Publish Date - 2023-04-17T18:33:08+05:30 IST

బీజేపీయేతర పాలిత రాష్ట్రాల గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారనే వార్తలు తరచూ వస్తున్నాయి.

Governor Vs CM Baghel : రిజర్వేషన్ బిల్లుపై ఛత్తీస్‌గఢ్ గవర్నర్, సీఎం మధ్య రచ్చ
Biswabhushan Harichandan, Bhupesh Baghel

రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) : బీజేపీయేతర పాలిత రాష్ట్రాల గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారనే వార్తలు తరచూ వస్తున్నాయి. తెలంగాణ, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తర్వాత ఈ జాబితాలో ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ కూడా చేరింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బాఘెల్ (Chhattisgarh chief minister Bhupesh Baghel) ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యవహార శైలిపై సోమవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఛత్తీస్‌‌గఢ్ శాసన సభ 2022 డిసెంబరు 3న రిజర్వేషన్ల బిల్లును ఆమోదించింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఇతర వెనుకబడిన తరగతులు (OBC)లకు 14 శాతం రిజర్వేషన్లను 27 శాతానికి పెంచింది. అదేవిధంగా షెడ్యూల్డు కులాలు (SC)లకు అంతకుముందు 12 శాతం రిజర్వేషన్లు ఉండేవి, దీనిని 13 శాతానికి పెంచింది. షెడ్యూల్డు తెగలు (ST)లకు 32 శాతం రిజర్వేషన్లను యథావిథిగా కొనసాగించింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి (EWS వారికి) నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 76 శాతానికి చేరాయి.

ఈ బిల్లును గతంలో గవర్నర్‌గా పని చేసిన అనుసూయా యూకీ (Anusuiya Uikey) ఆమోదించవలసి ఉంది. కానీ ఆయన దీనిని పెండింగ్‌లో పెట్టారు. ఆయన తర్వాత గవర్నర్ పదవిని చేపట్టిన బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలపడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బాఘెల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం గురించి ప్రస్తావించారు. ఇటువంటి తీర్మానాలను తాము చేయాలనుకోవడం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్ శాసన సభ ఆమోదించిన బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరుతున్నామని చెప్పారు. ఈ బిల్లుకు ఆమోదం తెలపకపోతే కనీసం తిప్పి పంపించాలని కోరుతున్నట్లు తెలిపారు. దానిని నిలిపి ఉంచడం సరికాదన్నారు. దీనిని నిలిపి ఉంచడం వల్ల లబ్ధిదారులపై ప్రభావం పడుతోందన్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జగడం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా జగ్‌దీప్ ధన్‌కర్ పని చేసిన కాలంలో ఆ రాష్ట్ర సీఎం మమత బెనర్జీతో తరచూ ఘర్షణ వాతావరణం కనిపిస్తూ ఉండేది.

ఇవి కూడా చదవండి :

Same-sex marriage : స్వలింగ వివాహాలపై పిటిషన్లను తోసిపుచ్చండి.. సుప్రీంకోర్టును కోరిన కేంద్రం..

PM Modi : కుల గణనపై మోదీకి ఖర్గే లేఖ

Updated Date - 2023-04-17T18:33:08+05:30 IST