Share News

Charges: పండగపూట.. చార్జీల మోత.. దసరాకు సొంతూరి ప్రయాణం బహుభారం

ABN , First Publish Date - 2023-10-20T12:08:49+05:30 IST

దసరా పండగకు ఊరెళ్లాలంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. బస్సులు, రైళ్లు, ఆఖరికి విమానాల్లో

Charges: పండగపూట.. చార్జీల మోత.. దసరాకు సొంతూరి ప్రయాణం బహుభారం

- అందినకాడికి దండుకుంటున్న ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్లు

- రైళ్లలో చాంతాడంత వెయిటింగ్‌ లిస్ట్‌

- విమానాల చార్జీలకూ రెక్కలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): దసరా పండగకు ఊరెళ్లాలంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. బస్సులు, రైళ్లు, ఆఖరికి విమానాల్లో కూడా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నెల 21 నుంచి 24 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు దసరా పండుగ(Dussehra festival) సెలవులు రావడంతో విమానాల చార్జీలకు రెక్కలు వచ్చాయి. బెంగళూరు నుంచి కోల్కత్తా, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ గన్నవరం(Hyderabad, Vijayawada Gannavaram) వైపు వెళ్ళే విమానాల చార్జీలు సాధారణ రోజుల కంటే దాదాపు రెండు మూడు రెట్లు అధికంగా ఉన్నాయి. అయినా పండుగ సంబరాలు జరుపుకోవాలన్న ఉత్సాహంతో చార్జీలు అధికంగా ఉన్నా ప్రజలు విమాన ప్రయాణాలవైపే మొగ్గుచూపుతున్నారు. మరోవైపు బెంగళూరు(Bengaluru) నుంచి దేశంలోని అన్ని ప్రముఖ నగరాలు పట్టణాలకు వెళ్ళే రైళ్ళలో చాంతాడంత వెయింటింగ్‌ లిస్టులు కనిపిస్తున్నాయి. ప్రయాణీకుల రద్దీని తట్టుకునే దిశలో అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నామని కొన్ని ప్రాంతాలకు దసరా ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నామని నైరుతి రైల్వే ప్రకటించింది. కాగా పండుగ రద్దీ నేపథ్యంలో కేఎ్‌సఆర్టీసీ దాదాపు 4వేలకు పైగా ప్రత్యేక బస్సులను రాష్ట్రవ్యాప్తంగా నడుపనుందని రవాణా శాఖా మంత్రి ఆర్‌.రామలింగారెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ (ఏపీఎస్ ఆర్టీసీ) తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ (టీఎస్ ఆర్టీసీ) కూడాసాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ప్రకటించాయి. మరోవైపు పండుగ రద్దీని ప్రయివేటు బస్సు ఆపరేటర్లుబాగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖ ప్రైవైట్‌ బస్సుల్లో చార్జీలు దాదాపు 20 నుంచి 40 శాతం వరకు పెంచేసినట్లు ప్రయాణికులు వాపోతున్నారు.

Updated Date - 2023-10-20T12:08:49+05:30 IST