Share News

Chandrayaan 3: భూవాతావరణంలోకి ప్రవేశించిన చంద్రయాన్ - 3 రాకెట్ బాడీ.. ఎక్కడ పడనుందంటే?

ABN , First Publish Date - 2023-11-16T17:03:45+05:30 IST

Moon Mission: చంద్రయాన్ - 3కి సంబంధించిన రాకెట్ బాడీ ఒకటి ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తోంది. స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లిన LVM-3 M4 రాకెట్ విడి భాగం ఒకటి నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో అది భూమిపైకి దూసుకువస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Chandrayaan 3: భూవాతావరణంలోకి ప్రవేశించిన చంద్రయాన్ - 3 రాకెట్ బాడీ..  ఎక్కడ పడనుందంటే?

బెంగళూరు: చంద్రయాన్ - 3కి సంబంధించిన రాకెట్ బాడీ ఒకటి ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తోంది. స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లిన LVM-3 M4 రాకెట్ విడి భాగం ఒకటి నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో అది భూమిపైకి దూసుకువస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అది బుధవారం మధ్యాహ్నం 2.24 గంటలకు భూ కక్ష్యలోకి ప్రవేశించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) వెల్లడించింది. ఇదే ఏడాది జులై 14న చంద్రయాన్ - 3 స్పేస్ క్రాఫ్ట్ ని LVM-3 M4 విజయవంతంగా తీసుకెళ్లింది. అయితే క్రయోజెనిక్ ఎగువ దశ అదుపుతప్పినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

అది 124 రోజుల తరువాత భూ వాతావరణానికి తిరిగి వచ్చినట్లు వెల్లడించారు. నేరుగా ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో పడుతుందని అంచనా వేశారు. ఈ రాకెట్ బాడీ (NORAD id 57321) చంద్రయాన్-3 వ్యోమ నౌకను జులై 14న కక్ష్యలోకి విజయవంతంగా ఇంజెక్ట్ చేసింది. LVM3 M4 క్రయోజెనిక్ ఎగువ దశ పోస్ట్ మిషన్ ఆర్బిటల్ జీవితకాలం 25 ఏళ్లుగా నిర్దేశించారు.

IADC మార్గదర్శకాలను అనుసరించి చంద్రయాన్-3 ప్రొపల్షన్, ల్యాండింగ్ మాడ్యూళ్లు రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత దాని అవశేషాలు, ఇంధన వనరులు ప్రమాదవశాత్తు పేలుడుకు గురికాకుండా ప్రమాద తీవ్రతను తగ్గించడానికి క్రయోజెనిక్ ఎగువ దశను నిష్క్రియాత్మకం చేశారు.


అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా రాకెట్ బాడీని నిష్క్రియం చేయడం ద్వారా భారత్ నిబద్ధత మరోసారి నిరూపితమైందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చంద్రయాన్ 3 భారత్ కి చెందిన మూడో మూన్ మిషన్. దీనిని జులై 14న శ్రీహరికోట(Sriharikota)లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు.

దాదాపు ఒక నెల తర్వాత, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన తరువాత ప్రజ్ఞాన్ రోవర్(Pragyan Rover) బయటకు వచ్చి శివశక్తి పాయింట్ దగ్గర 14 రోజుల పాటు పరిశోధనలు చేసింది.

చంద్రుడిపై 15 రోజులు పగలు, ఆ పైన 15 రోజులు రాత్రి ఉండటంతో శాస్త్రవేత్తలు రెండింటినీ నిద్రాణ స్థితిలోకి పంపారు. ఆ తరువాత 15 రోజులకు చంద్రుడిపై సూర్యోదయం కావడంతో వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో అవి శాశ్వతంగా నిద్రాణ స్థితిలోకి చేరుకున్నాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు దాదాపు ఆశలు వదులుకున్నారు. మొత్తంగా చంద్రయాన్ - 3తో చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డ్ నెలకొల్పింది. ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ నుండి విడిపోయి చంద్రుడి చుట్టూ తిరుగుతోంది.

Updated Date - 2023-11-16T17:03:47+05:30 IST