Share News

Amit shah: అది ఈ దేశ చట్టం...ఏ శక్తి ఆపలేదు: అమిత్‌షా

ABN , First Publish Date - 2023-11-29T16:56:55+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టం అమలు కాకుండా ఏ శక్తీ ఆపలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. సీఏఏ ఈ దేశ చట్టమని స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో బుధవారంనాడు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మమతా బెనర్జీ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

Amit shah: అది ఈ దేశ చట్టం...ఏ శక్తి ఆపలేదు: అమిత్‌షా

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act -CAA) అమలు కాకుండా ఏ శక్తీ ఆపలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. సీఏఏ ఈ దేశ చట్టమని స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని కోల్‌కతాలో బుధవారంనాడు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మమతా బెనర్జీ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని కోరారు.


''సీఏఏ ఈ దేశ చట్టం. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అమలుచేస్తుంది. ఎవరూ దీన్ని ఆపలేరు'' అని పరోక్షంగా మమతా బెనర్జీ వ్యతిరేకతను ప్రస్తావిస్తూ అమిత్‌షా అన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్‌ నుంచి 2014 డిసెంబర్ 31, అంతకంటే ముందు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్ మైగ్రెంట్లకు పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ- 2019 ఉద్దేశించింది. డిసెంబర్ 12న ఈ చట్టాన్ని నోటిఫై చేయగా, 2020 జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది.


18 లోక్‌సభ, 77 అసెంబ్లీ సీట్లు

పశ్చిమబెంగాల్‌ భవిష్యత్తుపై బీజేపీకి స్పష్టమైన విజన్ ఉందని కోల్‌కతా ర్యాలీలో అమిత్‌షా తెలిపారు. పశ్చిమబెంగాల్ ప్రజలు 18 లోక్‌సభ స్థానాలు, 77 స్థానాలు బీజేపికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బెంగాల్ అసెంబ్లీ నుంచి బీజేపీ నేత సువేందు అధికారిని సస్పెండ్ చేసి ఉండవచ్చని, కానీ ప్రజల వాణిని అణగదొక్కలేరని అన్నారు. బెంగాల్ ప్రభుత్వాన్ని సాగనంపుతామని ప్రజలంతా చెబుతున్నారని తెలిపారు. రాష్ట్ర సంక్షేమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంపుతున్న నిధులు అధికార టీఎంసీ జోక్యం వల్లే ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు.


2016 ఎన్నికల్లో గెలుపు బీజేపీదే..

బీజేపీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో పశ్చిమబెంగాల్‌లో అధికారంలోకి వస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని, తద్వారా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయానికి బాసటగా నిలబడాలని కోరారు. పశ్చిమబెంగాల్‌లో 212 మంది బీజేపీ కార్యకర్తలను హత్య చేశారని, 2026 ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం ద్వారా ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అన్నారు.

Updated Date - 2023-11-29T16:56:56+05:30 IST