Women Reservation Bill: ఇస్లాంలో మహిళలకు హక్కులు ఉండవు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-21T14:56:59+05:30 IST

తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని కలరింగ్స్ ఇస్తూనే.. కొందరు బీజేపీ నేతలు ఇస్లాం మతంపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తమ రాజకీయ స్వార్థం కోసం హిందూ-ముస్లిం అంశాన్ని..

Women Reservation Bill: ఇస్లాంలో మహిళలకు హక్కులు ఉండవు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని కలరింగ్స్ ఇస్తూనే.. కొందరు బీజేపీ నేతలు ఇస్లాం మతంపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తమ రాజకీయ స్వార్థం కోసం హిందూ-ముస్లిం అంశాన్ని పదే పదే తెరమీదకు తీసుకొస్తూ వస్తుంటారు. అవసరం లేని విషయాల్లోనూ సరికొత్త వివాదాలకు బీజం వేస్తుంటారు. ఇప్పుడు మరో బీజేపీ నేత కూడా అదే పని చేశారు. లోక్‌సభ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా AIMIM పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయడంపై.. బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లాంలో మహిళలకు హక్కులు ఉండవని, అందుకే ఆ ఇద్దరు ఎంపీలు ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ కుండబద్దలు కొట్టారు.


మంగళవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు(నారీశక్తి వందన్ చట్టం)ను కేంద్రం ప్రవేశపెట్టగా.. బుధవారం (సెప్టెంబర్ 20) దాన్ని లోక్‌సభ ఆమోదించింది. అయితే.. AIMIM ఎంపీలైన అసదుద్దీన్ ఒవైసీ, ఇంతియాజ్ అలీ మాత్రం ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీనిపై జగన్నాథ్ సర్కార్ మాట్లాడుతూ.. ‘‘ఇస్లాంలో మహిళలకు హక్కులు లేవు. అందుకే వాళ్లిద్దరు మహిళలకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ.. మా నాయకుడైన ప్రధాని మోదీకి విధానం, ఉద్దేశాలు రెండూ ఉన్నాయి. బీజేపీ వాస్తవాలపై పనిచేస్తుంది’’ అని అన్నారు. అదే సమయంలో.. తాను ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశానన్న విషయంపై ఒవైసీ స్పష్టం చేశారు. ‘‘ముస్లిం, ఓబీసీ మహిళల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో ఇద్దరు వ్యక్తులు పోరాడుతున్నారని దేశానికి తెలిసేలా మేం వ్యతిరేకంగా ఓటు వేశాం’’ అని చెప్తూ.. జగన్నాథ్ సర్కార్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇదిలావుండగా.. మంగళవారం కేంద్రమంత్రి రామ్ మేఘ్వాల్ కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లును సమర్పించారు. దీనికి ప్రధాని మోదీ నారీశక్తి వందన్ చట్టం అనే పేరు పెట్టారు. లోక్‌సభలో లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం.. ఈ బిల్లు ఆమోదం పొందింది. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), బీఎంకే, టీఎంసీ సహా అన్ని విపక్షాలు సభలో బిల్లుకు మద్దతు పలికాయి. అయితే అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు పోలయ్యాయి. గురువారం రాజ్యసభలోనూ ఈ బిల్లు ఆమోదం పొంది, చర్చకు రానుంది.

Updated Date - 2023-09-21T14:56:59+05:30 IST