Supreme court: ఈడీ చర్యలపై సుప్రీంకోర్టు అసహనం.. ప్రతీకార చర్యలు తగదని వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-04T14:50:42+05:30 IST

మనీ లాండరింగ్ కేసుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసుల దర్యాప్తు సమయంలో ఈడీ ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడరాదని, పారదర్శకంగా, న్యాయంగా వ్యవహరించాలని సూచించింది.

Supreme court: ఈడీ చర్యలపై సుప్రీంకోర్టు అసహనం.. ప్రతీకార చర్యలు తగదని వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చర్యలపై సుప్రీంకోర్టు (Supreme court) సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసుల దర్యాప్తు సమయంలో ఈడీ ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడరాదని, పారదర్శకంగా, న్యాయంగా వ్యవహరించాలని సూచించింది. మనీలాండరింగ్ కింద తమను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం రియల్ ఎస్టేట్ గ్రూప్‌ డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకల్ బన్సల్ వేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తక్షణం ఆ ఇద్దరినీ విడుదల చేయాలని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, సంజయ్ కుమార్‌లతో కూడిన దర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.


పంకజ్ బన్సల్, బసంత్ బన్సల్‌ను జూన్ 14న మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ పిలిపించింది. ఈడీనే రిజిస్టర్ చేసిన మరో కేసులో వారిని అరెస్టు చేసింది. జూన్ 1న బన్సల్ సోదరుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ సోదాలు జరపగా, వీరు పంజాబ్‌-హర్యానా కోర్టును ఆదేశించారు. జూలై 5వ తేదీ వరకూ వారికి అరెస్టు నుంచి కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. అయితే, జూన్ 14న విచారణ కోసం వీరిని పిలిపించి ఈడీ అరెస్టు చేసింది. కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. పంజాబ్-హర్యానా కోర్టును బన్సాల్ సోదరులు సవాలు చేసినా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టును వారు ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పైనే సుప్రీంకోర్టు విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది.


ఈడీ అధికారుల చర్యలను ధర్మాసనం తప్పుపడుతూ, ఈడీ అడిగిన ప్రశ్నలకు నిందితులు సమాధానం చెప్పలేదన్న కారణంగా అరెస్టు చేయడం సరికాదని, మనీలాండరింగ్ కింద వారు నేరాలకు పాల్పడ్డారన్న కచ్చితమైన ఆధారాలతోనే అరెస్టు చేయాలని, అరెస్టు సమయంలో అందుకు కారణాలను కూడా నిందితులకు లిఖితపూర్వకంగా అందించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిన నిందితులను ఇద్దరినీ తక్షణమే విడుదల చేయాలని ఈడీని ఆదేశించింది.

Updated Date - 2023-10-04T14:52:14+05:30 IST