Odisha train accident : బహనాగ గ్రామస్థుల ఔదార్యం.. ఒడిశా రైలు ప్రమాద మృతులకు దశ దిన కర్మలు, సామూహిక శిరోముండనాలు..
ABN , First Publish Date - 2023-06-13T13:59:29+05:30 IST
ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై, 288 మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు దాదాపు 1,000 మంది గాయపడటంతో ప్రపంచం తీవ్ర ఆందోళనకు గురైంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపినవారిలో వివిధ దేశాల అధినేతలు ఉన్నారు. బాధితులకు తమకు చేతనైనంత సాయం చేయడానికి స్థానికులు కూడా ముందుకు వచ్చారు.
బాలాసోర్ : ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై, 288 మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు దాదాపు 1,000 మంది గాయపడటంతో ప్రపంచం తీవ్ర ఆందోళనకు గురైంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపినవారిలో వివిధ దేశాల అధినేతలు ఉన్నారు. బాధితులకు తమకు చేతనైనంత సాయం చేయడానికి స్థానికులు కూడా ముందుకు వచ్చారు. కొందరు రక్తదానం చేయడం కోసం ఆసుపత్రుల వద్ద బారులు తీరారు. మరోవైపు హిందూ మత ఆచారాల ప్రకారం, మరణించిననాటి నుంచి పదో రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజు దశ దిన కర్మ చేస్తారు. దీనిని బహనాగ ప్రజలు కూడా పాటించి, ఈ ప్రమాద మృతులకు నివాళులర్పించారు.
రైలు ప్రమాదంలో మరణించిన 288 మందికి దశ దిన కర్మ చేసే సందర్భంగా ఆదివారం బహనాగ గ్రామస్థులు సామూహికంగా గుండు చేయించుకున్నారు. మృతదేహాలను ఒక రోజు భద్రపరచిన ప్రభుత్వ నోడల్ హైస్కూల్ సమీపంలోని చెరువు వద్దకు గ్రామస్థులు చేరుకుని, శిరోముండనం చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఓ స్మారక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
రిటైర్డ్ టీచర్ గయాధర్ రాజ్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, కొందరి వివరాలు ఇంకా తెలియడం లేదని చెప్పారు. అటువంటి దురదృష్టవంతుల కోసం తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాలకే తాను అక్కడికి చేరుకున్నానని, తన కళ్ల ముందే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, తాను చాలా మందిని కాపాడానని చెప్పారు. ప్రభుత్వం చెప్తున్నట్లుగా మరణించినవారు కేవలం 288 మంది మాత్రమే కాదని, ఇంకా ఎక్కువ మంది ఉండవచ్చునని చెప్పారు. వివరాలు తెలియని మృతదేహాలు చాలా ఉన్నాయన్నారు. అలాంటివారి ఆత్మ విముక్తి కోసం తాము ప్రార్థన చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమ నిర్వాహక కమిటీ కన్వీనర్ శరత్ రాజ్ మాట్లాడుతూ, మృతుల ఆత్మ శాంతి కోసం తాము మూడు రోజులపాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ విభేదాలకు అతీతంగా తమ గ్రామస్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. ప్రమాదం జరిగిన ఐదు నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని బాధితులకు సహాయపడ్డామన్నారు. బాధితులకు 24 గంటలపాటు సేవలందించామన్నారు. గాయపడినవారిలో చాలా మంది తమ కళ్ల ముందే మరణించారన్నారు.
ఇవి కూడా చదవండి :
AIADMK Vs BJP : బీజేపీతో తెగదెంపులకు ఏఐఏడీఎంకే సిద్ధం?
Govt Vs Twitter : ట్విటర్ మాజీ సీఈఓ ఆరోపణలు పూర్తిగా అబద్ధం : కేంద్ర మంత్రి