Australian PM: మోదీతో కలిసి అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించనున్న అల్బనీస్

ABN , First Publish Date - 2023-02-20T17:42:16+05:30 IST

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్ ఇండియా పర్యటనకు విచ్చేయనున్నారు. మార్చిలో ఆయన ఇండియాలో తొలిసారి..

Australian PM: మోదీతో కలిసి అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించనున్న అల్బనీస్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి (Australian Prime minister) ఆంథోని అల్బనీస్ (Anthony Albanese) ఇండియా పర్యటనకు విచ్చేయనున్నారు. మార్చిలో ఆయన ఇండియాలో తొలిసారి పర్యటించనున్నారు. ఇందుకు తగిన సన్నాహాలు జరుగుతున్నాయి. భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు అల్బనీస్ పర్యటన దోహదపడనుంది. అల్బనీస్ తన పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌‌లో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న క్రికెట్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి వీక్షించనున్నారు.

అల్బనీస్ తొలిసారి భారత్‌లో పర్యటించనున్నారని, ఇందులో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులు, క్రిటికల్ మినరల్స్ సహా అనేక అంశాలపై చర్చలు జరుపుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మార్చి 8న అల్బనీస్ ఇండియాకు వస్తారని, మోదీతో కలిసి అహ్మబాద్ వెళ్లి, రెండు దేశాల జట్ల మధ్య జరిగే నాలుగో క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌కు హాజరవుతారని ఆ వర్గాలు తెలిపాయి. మార్చి 9న అహ్మదాబాద్‌లో ఫోర్త్ టెస్ట్ ప్రారంభం కానుంది.

కాగా, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి పర్యటనకు మార్గం సుగమం చేసేందుకు వీలుగా గత వారంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆ దేశంలో పర్యటించారు. జైశంకర్‌తో సమావేశమైనట్లు అల్బనీస్‌ సైతం ఓ ట్వీట్‌లో తెలిపారు. వచ్చే నెలలో భారత్ పర్యటనకు ముందు డాక్టర్ జైశంకర్‌తో ఇవాళ ఉదయం సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక అవకాశాలు, ప్రజా సంబంధాలు సహా ఉభయదేశాలకు ప్రయోజనం చేకూర్చే పలు అంశాలపై తాము మాట్లాడుకున్నామని ఆ ట్వీట్‌లో అల్బనీస్ తెలిపారు.

Updated Date - 2023-02-20T17:42:17+05:30 IST