Odisha : మంత్రిపై కాల్పులు జరిపిన పోలీస్ అధికారి మామూలోడు కాదు!
ABN , First Publish Date - 2023-01-31T11:16:38+05:30 IST
ఒడిశా మంత్రి నబ కిశోర్ దాస్ (61)పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ కృష్ణ దాస్ సర్వీస్
భువనేశ్వర్ : ఒడిశా మంత్రి నబ కిశోర్ దాస్ (61)పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ కృష్ణ దాస్ సర్వీస్ రికార్డు చాలా విషయాలను చెప్తోంది. ఉద్యోగ జీవితంలో ఆయన సేవలకు ప్రభుత్వం అనేకసార్లు సత్కరించినట్లు వెల్లడవుతోంది. 2016కు ముందు ఆయనకు పోలీసింగ్‌లో 12 గుడ్ సర్వీస్ మార్కులు వచ్చాయి. దర్యాప్తులను విజయవంతంగా పూర్తి చేసినందుకు 18 పతకాలు, ఎనిమిదిసార్లు నగదు పురస్కారాలు లభించాయి.
గోపాల్ హవల్దార్ (సీనియర్ కానిస్టేబుల్) నుంచి ఏఎస్ఐగా 2009 సెప్టెంబరు 9న పదోన్నతి పొందారు. బరంపురంలో ఆయన పని చేసేవారు. ఆయన కెరీర్‌లో కేవలం ఒకసారి మాత్రమే మైనర్ పనిష్మెంట్ కేటగిరీ నిబంధనల ప్రకారం శిక్షను పొందారు. అది కూడా కేవలం ఓ హెచ్చరిక మాత్రమే. ఇటువంటి శిక్షలు ఉద్యోగుల కెరీర్‌కు ఏ విధంగానూ ఆటంకం కావు. పదోన్నతులు ఇచ్చేటపుడు వీటిని పరిగణనలోకి తీసుకోరు. ఆయనకు మానసిక అస్వస్థత ఉందని ఆయన భార్య జయంతి చెప్తున్నప్పటికీ, సర్వీస్ రికార్డులో అటువంటి అంశాలేవీ కనిపించలేదు.
గోపాల్ 2020 నవంబరు నుంచి గాంధీ చౌక్ పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఒడిశాలోని జార్సిగూడలో ఆదివారం ఆయన రాష్ట్ర మంత్రి నబ కిశోర్‌పై కాల్పులు జరిపారు. ఆ తర్వాత నబ కిశోర్ ప్రాణాలు కోల్పోయారు. గోపాల్ కేవలం ఆయనపై మాత్రమే ఎందుకు కాల్పులు జరిపారో తెలియడం లేదు. పోలీసులు ఈ అంశంపై మౌనంగా ఉన్నారు. బహుశా నబ కిశోర్‌పై వ్యక్తిగత ద్వేషం ఉండి ఉండవచ్చునని పోలీసులు చెప్తున్నారు.
గోపాల్ పొంతనలేని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. బలమైన ఆధారం దొరికిన తర్వాత మాత్రమే తాము ఆయన ఉద్దేశాన్ని తెలియజేయగలమని అంటున్నారు. ఆయన మానసిక అస్వస్థుడా? కాదా? అనే విషయంలో కూడా తాము దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు.