Asaduddin Owaisi: మోదీ, జిన్‌పింగ్ మీటింగ్‌పై అసదుద్దీన్ ఫైర్.. మోదీ అసలు ఏం దాస్తున్నారు?

ABN , First Publish Date - 2023-08-25T17:46:39+05:30 IST

అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. మరోసారి మోదీని టార్గెట్ చేశారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్...

Asaduddin Owaisi: మోదీ, జిన్‌పింగ్ మీటింగ్‌పై అసదుద్దీన్ ఫైర్.. మోదీ అసలు ఏం దాస్తున్నారు?

అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. మరోసారి మోదీని టార్గెట్ చేశారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య జరిగిన అనధికారిక సంభాషణను ఉద్దేశిస్తూ.. మోదీ ప్రభుత్వం చైనాకు లొంగిపోయిందని ఆరోపించారు. సరిహద్దు వివాదం దేశ భద్రతకు సంబంధించిన సమస్య అని.. ఇదేమీ మోదీ ఒక్కడికే చెందిన వ్యక్తిగత విషయం కాదని.. దీనిపై పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఒవైసీ డిమాండ్ చేశారు. చైనీయులకు భయపడకుండా మన భారత వీర సైనికులు 40 నెలల పాటు సరిహద్దుల్లో నిలబడ్డారని.. అలాంటప్పుడు మోదీ ఎందుకు జిన్‌పింగ్ ముందు నిలబడలేకపోతున్నారని ఒవైసీ ఎద్దేవా చేశారు.


ఒకవైపు చైనా వాళ్లు భారత భూభాగంలో ఆక్రమణలకు పాల్పడుతుంటే.. దేశ ప్రధాని మోదీ మాత్రం చైనా ప్రధాని వెనకాల ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అసలు దేశ ప్రజల నుంచి ఏం దాచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. చైనా ముందు బీజేపీ సర్కార్ ఎందుకు మెకరిల్లుతోందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. భారత్, చైనా మధ్య ఇప్పటివరకూ 19 సార్లు చర్చలు జరిగాయని.. ఆ చర్చల్లో ఏం మాట్లాడుకున్నారో దేశ ప్రజలకు చెప్పాలని ఒవైసీ కోరారు. లఢఖ్‌లో ఏం జరుగుతుందో చెప్పకుండా బీజేపీ సర్కార్ దాచిపెడుతోందని ఆరోపణలు గుప్పించారు. అసలు ఆర్మీని అగ్రిమెంట్‌ల కోసం ఎందుకు ఒత్తిడి చేస్తోందని చెప్పాలన్నారు. లడఖ్ సరిహద్దులో వాస్తవ పరిస్థితులపై దేశాన్ని అంధకారంలో ఉంచుతూ.. చైనా అధ్యక్షుడితో ప్రధాని సమావేశాన్ని కోరుతున్నారని ఒవైసీ పేర్కొన్నారు.

కాగా.. సరిహద్దు వివాదాలపై భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపాలని చైనా కోరుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్ మధ్య అనధికారిక చర్చ జరిగింది. ఈ సమావేశంలో.. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు కొనసాగాలంటే, LAC విషయంలో గౌరవంగా ఉంటాని మోదీ సూచించినట్లు తెలిసింది. కానీ.. ఒవైసీ మాత్రం ఈ భేటీని మోదీ ప్రభుత్వం చైనా ముందు లొంగిపోయినట్లు అభివర్ణించారు. ఇదే సమయంలో భారతీయ సైనికులపై మోదీకి విశ్వాసం లేదా? అని ప్రశ్నించారు కూడా! మరి, ఈ వ్యవహారంపై బీజేపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Updated Date - 2023-08-25T17:46:39+05:30 IST