COVID-19 Alert : దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిక

ABN , First Publish Date - 2023-04-21T17:53:14+05:30 IST

ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కట్టడికి ..

COVID-19 Alert : దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిక

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 8 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కట్టడికి తగు చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు 8రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆరోగ్యశాఖ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

మార్చి నెల మొదటి ప్రారంభం నుంచి భారతదేశంలో COVID-I9 కేసులు క్రమంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. గత వారం రోజులుగా రోజువారీ కరోనా కేసులు 10వేలకు పైగా నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గడిచిన వారంలో కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. అంతకుముందు వారం 4.7గా ఉన్న పాజిటివిటీ రేటు ఈ వారం 5.5శాతానికి పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కోవిడ్ సోకిన వారు ఆస్పత్రిలో చేరడం, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు రాజేశ్ భూషణ్ తెలిపారు.

కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో అధికసంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నందున కమ్యూనిటీ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది.కాబట్టి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవసరమైన ప్రజారోగ్య చర్యలు చేపట్టడం అవసరం మని కేంద్రం భావించింది. ప్రారంభ దశలోనే ఇటువంటి ప్రమాదాలను గుర్తించి, నియంత్రించినట్లయితే కరోనాను కట్టడి చేయొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు.

మహమ్మారి నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అనుసరించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి భూషణ్ రాష్ట్రాలకు సూచించారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ అంశాలపై కీలక దృష్టితో సత్వర సమర్థవంతమైన ప్రజారోగ్య చర్యలను ప్రారంభించడం చాలా కీలకమని తెలిపారు.

covid.jpg

మహమ్మారి ఇంకా ముగియలేదు

కోవిడ్ మహమ్మారి పూర్తిగా అంతమొందలేదని, నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదమని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి భూషణ్ హెచ్చరించారు. మహమ్మారి పూర్తిస్థాయిలో అరికట్టాలంటే డేటా ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించడం చాలా కీలకమని అన్నారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు పటిష్టమైన నిఘా, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరమని భూషణ్ అన్నారు.

భారతదేశంలో కోవిడ్ కేసులు

భారతదేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు నమోదయ్యాయి, అయితే క్రియాశీల కేసులు 66,170కి పెరిగాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా 28 మరణాలతో మరణాల సంఖ్య 5,31,258కి పెరిగింది. ఇందులో కేవలం ఒక్క కేరళలోనే 9 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 4.48 కోట్లు (4,48,69,684) ఈరోజు కోవిడ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 4,42,72,256మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ప్రస్తుతం క్రియాశీల కేసులు 0.15 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.67 శాతంగా, మరణాల రేటు1.18 శాతంగా నమోదైనట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated Date - 2023-04-21T17:57:43+05:30 IST