Kiran Rijiju: అదానీ అంశం లేవనెత్తడం వెనుక కారణమిదే...!

ABN , First Publish Date - 2023-04-08T18:49:09+05:30 IST

న్యూఢిల్లీ: అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వెయ్యాలంటూ ఓవైపు కాంగ్రెస్ దుమారం రేపుతుంటే, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాత్రం ఆ అంశాన్ని తేలిగ్గా..

Kiran Rijiju: అదానీ అంశం లేవనెత్తడం వెనుక కారణమిదే...!

న్యూఢిల్లీ: అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) వెయ్యాలంటూ ఓవైపు కాంగ్రెస్ దుమారం రేపుతుంటే, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) మాత్రం ఆ అంశాన్ని తేలిగ్గా కొట్టివేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజకీయ కెరీర్‌ను మెరుగుపరచేందుకే ఉద్దేశపూర్వకంగా అదానీ అంశాన్ని లేవనెత్తుతున్నారంటూ ఆయన తాజాగా ఆరోపించారు. రాజకీయంగా రాహుల్ విఫలమయ్యారని అన్నారు. న్యాయవ్యవస్థను బలహీనపరచేందుకు కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీ (Congress) ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

కోర్టులో ఉన్నందున వ్యాఖ్యానించేది లేదు..

హిండెన్‌బర్గ్-అదానీ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు రిజిజు సమాధానమిస్తూ...''హిండెన్‌బర్గ్-అదానీ అంశంపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకులేదు. దీనిపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దానిపై కమిటీ దృష్టి సారించింది. అయితే ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను. వీళ్లు (కాంగ్రెస్) కేవలం రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్‌ను మెరుగుపరచేందుకే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారని చెప్పదలచుకున్నాను'' అని జమ్మూ యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాహుల్ గాంధీపై 2019 పరువునష్టం కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి నాలుక కత్తిరిస్తామంటూ కాంగ్రెస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ, కాంగ్రెస్ నైరాశ్యంలో ఉందని, న్యాయవ్యవస్థపై దాడి జరుపుతోందని, అయితే ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఊరుకోదని చెప్పారు. న్యాయవ్యవస్థను బెదిరించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని, 1975లో ఎమర్జెన్సీకి ముందు కూడా ఆ పార్టీ నాయకులు న్యాయవ్యవస్థపై దాడి చేశారని, ఆ పార్టీ నైరాశ్యంలో ఉన్నందున మరిన్ని దాడులు కూడా చేయవచ్చని రిజిజు అన్నారు.

Updated Date - 2023-04-08T18:49:09+05:30 IST