Gautami Tadimalla:బీజేపీతో 25 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న నటి.. వైరల్ అవుతున్న లేఖ
ABN , First Publish Date - 2023-10-23T12:28:52+05:30 IST
తమిళనాడు(Tamilnadu) బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత, నటి గౌతమి తాడిమళ్ల(Actor Gautami Tadimalla) ఇవాళ రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. రిజైన్ లెటర్ ని పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైకు పంపించారు.
చెన్నై: తమిళనాడు(Tamilnadu) బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత, నటి గౌతమి తాడిమళ్ల(Actor Gautami Tadimalla) ఇవాళ రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. రిజైన్ లెటర్ ని పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైకు పంపించారు. ఆ లేఖలో తనను మోసం చేసిన వ్యక్తులకు బీజేపీ(BJP) నేతలు సహకరిస్తున్నారని.. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. లేఖలో.. "25 ఏళ్లుగా పార్టీని బలపరచడానికి ఎంతో కృషి చేశాను. ప్రాపర్టీ, మనీ విషయంలో నన్ను మోసం చేసిన అలగప్పన్(Alagappan)కు కొందరు బీజేపీ నేతలు సహకరిస్తున్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం ఊహించలేని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాను. బీజేపీ అగ్రనేతలు తనకు మద్దతు ఇవ్వట్లేదు. తనను మోసం చేసిన వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇది కరెక్టేనా?. చివరి శ్వాస వరకు న్యాయం కోసం పోరాడతా.." అని రాశారు. ఈ లెటర్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు. పార్టీకి దూరం కావడం బాధగా ఉన్నా.. జరుగుతున్న పరిణామాలన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
20 ఏళ్ల క్రితమే గౌతమి జీవితంలోకి అలగప్పన్..
గౌతమి 25 ఏళ్ల కింద బీజేపీలో చేరినప్పటి నుంచి ఏ సమస్య రాలేదని కానీ ఇటీవల ఆమె ఓ వ్యక్తి చేతిలో మోసపోయినట్లు తెలుస్తోంది. అలగప్పన్ ఆమె కూడబెట్టిన సంపాదనంతా దోచుకుని మోసం చేశాడని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు ఆయనకే సపోర్ట్ చేస్తుండటంతో గౌతమి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను, తన కూతురు మంచి లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో తరుణంలో అలగప్పన్ తన జీవితంలోకి వచ్చాడని.. అనంతరం తమను మోసం చేశాడని, డబ్బు, డాక్యుమెంట్లు, ఆస్తులను కాజేశాడని గౌతమి ఆరోపిస్తున్నారు. 20 ఏళ్ల కిందటే గౌతమి తన తల్లిదండ్రులను కోల్పోయి బాధలో ఉన్న సమయంలో అలగప్పన్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. గౌతమి అతన్ని నమ్మి, ఆస్తులు, భూముల పత్రాలను చేతిలో పెట్టారు. అలగప్పన్ తనను మోసం చేసిన విషయాన్ని ఈమధ్యే తెలుసుకున్నానన్న గౌతమి బహిరంగంగా ఆరోపణలు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తున్నా.. కొందరు పార్టీలోనే ఉంటూ అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారని ఆమె వాదన. దీంతో బీజేపీతో సుదీర్ఘ రాజకీయ ప్రస్తానానికి ముగింపు పలికారు.