Karnataka High Court : ప్రధాన మంత్రిని దూషించడం రాజద్రోహం కాదు : కర్ణాటక హైకోర్టు

ABN , First Publish Date - 2023-07-07T15:11:12+05:30 IST

ప్రధాన మంత్రిని దూషిస్తూ మాట్లాడే మాటలు కేవలం అవమానకరం, అగౌరవప్రదం, బాధ్యతారహితం మాత్రమేనని, రాజద్రోహంగా పరిగణించదగినవి కాదని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) తెలిపింది. బీదర్‌లోని షహీన్ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన రాజద్రోహం కేసును రద్దు చేసింది. హైకోర్టు కలబుర్గి ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

Karnataka High Court : ప్రధాన మంత్రిని దూషించడం రాజద్రోహం కాదు : కర్ణాటక హైకోర్టు

బెంగళూరు : ప్రధాన మంత్రిని దూషిస్తూ మాట్లాడే మాటలు కేవలం అవమానకరం, అగౌరవప్రదం, బాధ్యతారహితం మాత్రమేనని, రాజద్రోహంగా పరిగణించదగినవి కాదని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) తెలిపింది. బీదర్‌లోని షహీన్ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన రాజద్రోహం కేసును రద్దు చేసింది. హైకోర్టు కలబుర్గి ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

బీదర్‌లోని షహీన్ పాఠశాల యజమానులు అల్లావుద్దీన్, అబ్దుల్ ఖలేక్, మహమ్మద్ బిలాల్ ఇనాందార్, మహమ్మద్ మెహతాబ్‌లపై న్యూటౌన్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను జస్టిస్ హేమంత్ చందన్‌గౌడర్ రద్దు చేశారు. వేర్వేరు మత వర్గాల మధ్య అశాంతికి కారణమైనట్లు (ఐపీసీ సెక్షన్ 153(ఏ)) ఈ కేసులో వెల్లడి కాలేదని తెలిపింది. ‘ప్రధాన మంత్రిని చెప్పుతో కొట్టాలి’ అనడం అవమానకరం మాత్రమే కాకుండా బాధ్యతారహితమని తెలిపింది. ప్రభుత్వ విధానాలను నిర్మాణాత్మకంగా విమర్శించడం అనుమతించదగినదేనని, అయితే ఓ విధాన నిర్ణయం తీసుకున్నందుకు, ఆ నిర్ణయం పట్ల సమాజంలో కొందరికి అభ్యంతరం ఉన్నందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని అవమానించకూడదని స్పష్టం చేసింది.

ఈ పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులు ఓ నాటికను ప్రదర్శించారని పోలీసులు ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితా అమలైతే ముస్లింలు భారత దేశాన్ని విడిచి వెళ్లిపోవలసి వస్తుందని ఈ నాటికలో చెప్పారని తెలిపారు. దీనిని ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇది బయటి ప్రపంచానికి తెలిసిందని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడాలని ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశం పిటిషనర్లకు ఉన్నట్లు కనిపించడం లేదని తెలిపింది. ప్రభుత్వాన్ని విమర్శిచడం నుంచి బాలలను దూరంగా ఉంచాలని పాఠశాలలకు హైకోర్టు సలహా ఇచ్చింది. విద్యకు సంబంధించిన అంశాల్లో బాలల సృజనాత్మకత అభివృద్ధి చెందే విధంగా నాటికలను ప్రదర్శించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. గతంలో ఇచ్చిన ఈ తీర్పు పూర్తి పాఠాన్ని ఇటీవల ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్ర తాత్కాలిక నిలుపుదల

2024 Lok Sabha Elections : మోదీ సంచలన నిర్ణయం.. తమిళనాడు నుంచి పోటీ?..

Updated Date - 2023-07-07T15:11:12+05:30 IST