Turkey earthquake: భూకంపం తర్వాత టర్కీలో ఓ గ్రామం ఏమైపోయిందో తెలుసా?... దడ పుట్టించే విషయాలు వెలుగులోకి...

ABN , First Publish Date - 2023-02-19T11:27:03+05:30 IST

టర్కీలో ఈ నెల 6న సంభవించిన భూకంపాలు విపరీతమైన విధ్వంసం సృష్టించాయి. ఆ దేశంలోని 11 ప్రావిన్స్‌ల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది.

Turkey earthquake: భూకంపం తర్వాత టర్కీలో ఓ గ్రామం ఏమైపోయిందో తెలుసా?... దడ పుట్టించే విషయాలు వెలుగులోకి...
Turkey Earthquake

న్యూఢిల్లీ : టర్కీలో ఈ నెల 6న సంభవించిన భూకంపాలు విపరీతమైన విధ్వంసం సృష్టించాయి. ఆ దేశంలోని 11 ప్రావిన్స్‌ల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది. దాదాపు 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు గడ్డ కట్టే చలి వాతావరణం ఇబ్బంది పెడుతోంది. డెమిర్కోప్రు అనే గ్రామం రెండు ముక్కలైపోవడం మరింత విషాదకరం.

తాజా సమాచారం ప్రకారం, టర్కీ (Turkey)లో 40,402 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గడ్డ కట్టే చలి వాతావరణంలో నిరాశ్రయులయ్యారు. ఆహారం కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెద్ద పెద్ద భవనాలు రాళ్ళ కుప్పలుగా మారిపోయాయి. డెమిర్కోప్రు అనే గ్రామం రెండు ముక్కలైపోయింది. ఈ గ్రామంలో సుమారు 1,000 మంది ఉన్నారు. ఇళ్ల శిథిలాలు మురికి నీటిలో కొట్టుకెళ్తున్నాయి. దక్షిణ టర్కీలోని ఓ చిన్న ఇంట్లోని ఓ అంతస్థు భూమిలోకి కూరుకుపోయింది. ఈ ఇంటి యజమాని మహిర్ కరటాస్ మాట్లాడుతూ తాను వ్యవసాయం చేస్తూ ఉంటానని తెలిపారు. తన వయసు 42 సంవత్సరాలని చెప్పారు. తన ఇల్లు 13 అడుగుల మేరకు భూమిలోకి కూరుకుపోయిందన్నారు. భూమి తలక్రిందులైందని తెలిపారు. తన ఇరుగుపొరుగు ఇళ్లు కూడా దేవుని ఆగ్రహానికి గురయ్యాయన్నారు. అదృష్టవశాత్తూ, తమ గ్రామంలో ఎవరూ మరణించలేదని తెలిపారు. కొందరు గాయాలతో బయటపడ్డారని చెప్పారు. ఇక్కడ ఉన్న పశువుల పాక కూలిపోవడంతో ఓ ఆవు కళేబరం కనిపించింది.

ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపాల్లో టర్కీ, సిరియాల్లో దాదాపు 46 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు దేశాల్లోనూ లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

హాటాయ్ ప్రావిన్స్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రాచీన నగరమైన అంటాక్యాలో చురుగ్గా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డెమిర్కోప్రు గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. భూకంపం వల్ల భూమిలోని నీరు పైకి వచ్చి, ఇప్పుడు నిలిచిపోయిందని ఈ నగరవాసులు చెప్పారు. రోడ్డు పూర్తిగా ఛిన్నాభిన్నమైపోయిందని, కొన్ని ముక్కలు ఓ మీటరు ఎత్తులో లేచిపోయాయని తెలిపారు. ఇదొక దీవిలా కనిపిస్తోందని, నీరు, బురద 30 మీటర్ల ఎత్తు వరకు లేచాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Baheswar Dham : ధీరేంద్ర శాస్త్రికి ముస్లిం మత పెద్దల షాక్

Delhi liquor policy : సీబీఐకి మనీశ్ సిసోడియా లేఖ

Updated Date - 2023-02-19T11:27:06+05:30 IST